థియేటర్లో.. జగన్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. పిచ్చపిచ్చగా కొట్టుకున్నారు

థియేటర్లో.. జగన్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్..  పిచ్చపిచ్చగా కొట్టుకున్నారు

ఏపీ సీఎం జగన్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అభిమానులు  పిచ్చపిచ్చగా కొట్టుకున్నారు. అదికూడా థియేటర్ లో.... ఇంతకీ ఏం జరిగిదంటే..  మమ్ముట్టి, జీవా ప్రధాన పాత్రల్లో మహి వి రాఘవ్ తెరకెక్కించిన చిత్రం యాత్ర 2.. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం నుంచి జ‌గ‌న్ తొలి సారి సీఎంగా ప్రమాణ స్వీకారం వ‌ర‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌తో ద‌ర్శకుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ మూవీని తెర‌కెక్కించారు. హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో సినిమా రన్ అవుతున్న టైమ్ లో జగన్, పవన్ అభిమానులు రెచ్చపోయి మరి కొట్టుకున్నారు.  

సినిమాలోని  చంద్రబాబు పాత్రధారి ఓ సన్నివేశంలో మాట్లాడుతూ..... 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తలాతోకా లేని కొత్త పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఒక్క శాతం ఓటు తేడాతో అధికారం వచ్చిందని  అంటాడు.. దీంతో ఆ తలాతోకా లేని పార్టీ జనసేన అని థియేటర్లలో ప్రేక్షకుల నుంచి కామెంట్లు వినిపించాయి. దీంతో పవన్ అభిమానులు గొడవకు దిగారు. మాటమాట పెరగడంతో గొడవ పెద్దదై కొట్టుకునే వరకువచ్చింది. గొడవ తీవ్రం కావడంతో ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువై మందిని అదుపులోకి తీసుకున్నారు.  అభిమానుల మధ్య గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2014 ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేయగా..  టీడీపీ, బీజేపీ..  జనసేన మద్దతుతో  కలిసి పోటీ చేశాయి.  ఈ ఎన్నికల్లో టీడీపీ 102, బీజేపీ -4, వైఎస్ఆర్సీపీ - 67 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాయి.  2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ  అధికారంలోకి వచ్చింది.