హీరో ఉపేంద్ర పేరు వినగానే ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు, అంతే వైవిధ్యమైన టైటిల్స్ గుర్తొస్తాయి. ఈసారి ఆయన ‘యుఐ ది మూవీ’ అనే చిత్రంతో సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్, వీనస్ ఎంటర్‌టైనర్స్ కేపీ శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ సినిమా గురించి ఉపేంద్ర ఇలా ముచ్చటించారు. యు అండ్ ఐ... మీలోనూ నాలోను ఒకటే కథ ఉంది. నాలాగే మీరు కూడా ఆలోచిస్తున్నారా అని క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మన ఆలోచనలన్నీ ఒకేలా ఉన్నాయి. నేను ఫీల్ అయ్యేదే మీరు కూడా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ప్రేక్షకులు ఇలాంటి చాలా విషయాల్ని డీకోడ్ చేస్తారు. దీన్ని మెటఫరికల్‌గా తీశాం. ఈ సినిమాతో ఆడియన్స్ ఇంటరాక్ట్ అవుతారు.
స్క్రిప్ట్‌కు ఏడాది పడితే మరో ఏడాది నా లుక్, క్యారెక్టర్ డిజైన్‌కు పట్టింది. అలాగే ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ ఈ సినిమా కోసం ఓ సర్రియల్ వరల్డ్‌ని క్రియేట్ చేశారు. డిఫరెంట్ సెట్స్‌ను డిజైన్ చేశాం. చూడగానే కొంత విచిత్రంగా అనిపిస్తాయి కానీ వాటిని డీకోడ్ చేసినప్పుడు దాని వెనకున్న అసలు కారణం అర్థం అవుతుంది. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ దీనికి మరో ప్లస్ పాయింట్. హంగేరిలో రికార్డింగ్ చేశాం. ప్రభాస్ సినిమాలో మైథలాజికల్ కల్కిని చూశారు. ఇందులో సైకలాజికల్ కల్కిని చూస్తారు (నవ్వుతూ). ఈ సినిమా నిడివి రెండు గంటల పది నిముషాలు. సినిమా బడ్జెట్‌ను బట్టి కాకుండా స్టోరీ డిమాండ్‌ను బట్టి రన్ టైమ్ ఉండాలని నేను నమ్ముతాను. అలాగే ఒక సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన దర్శకుడు ముఖ్యం అంటారు.. కానీ నేను ఓనర్ ఆఫ్ ది షిప్ నిర్మాత ముఖ్యం అంటాను. మా నిర్మాతలు ఈ చిత్రాన్ని పెద్ద స్కేల్‌లో తీశారు.
ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా సినిమాలు తీయాలనే ఉద్దేశం లేదు. ఎందుకంటే ప్రేక్షకులు ఎంటర్‌టైన్మెంట్ కోసమే సినిమాకి వస్తారు. ఇందులో కూడా అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. నార్మల్‌గా చూస్తే ఓ మంచి సినిమా అనిపిస్తుంది. కాస్త పరీక్షగా చూస్తే ఒక లేయర్, ఇంకాస్త తరచి చూస్తే పొలిటికల్ యాంగిల్, ఇంకా లోతుగా చూస్తే ఫిలసాఫికల్ యాంగిల్ కనిపిస్తాయి. ఇందులో అన్నీ ట్రై చేశా.. ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బ్యాట్ అనే మన ఎడ్యుకేషన్ సిస్టం వల్ల మన థింకింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఆపిల్‌తో పాటు మరికొన్ని పదాలు చెప్పుంటే మన ఆలోచన మరోలా ఉండేది. నా కథల్లో కూడా అలాంటి ఒక కొత్త ఆలోచనను చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటా. ధైర్యమో, పిచ్చితనమో తెలియదు కానీ.. నాకు చెప్పాలనిపించింది నా సినిమా ద్వారా చెప్పేస్తా. ఏంజెల్స్ వెళ్లడానికి భయపడే దారిలో.. ఒక ఫూల్ వెళ్తాడని సామెత ఉంది. బహుశా నేను కూడా ఆ గట్ ఫీలింగ్‌తో వెళ్తున్నానేమో (నవ్వుతూ).
నా వరకు థియేటర్లో కూర్చొని సినిమా చూసే ప్రేక్షకులే అసలైన స్టార్స్. నా ఫస్ట్ మూవీకే అది అర్థమైంది. ఒక ఫిల్మ్ మేకర్ కంటే కూడా వాళ్లు పై స్థాయిలో ఉంటారు. నా సినిమాలకు సీక్వెల్స్ చేసే ఆలోచన నాకు లేదు. మరేమైనా కొత్త కథలు చెప్పాలని ఉంటుంది. ఈ సినిమాకు కూడా సీక్వెల్ లేదు. నా సినిమాల ద్వారా సమాజాన్ని మార్చాలి అనుకోను. అలా మార్చడానికి నేనెవరిని. నన్ను నేనే మార్చుకోలేకపోతుంటాను. అందుకే నేను ఎప్పుడూ మెసేజ్ ఇవ్వను, తీసుకోను. ఈ సినిమాలో కూడా అదే చెప్పా (నవ్వుతూ).
రజినీకాంత్ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయనతో కలిసి వర్క్ చేయడం నా లైఫ్ టైమ్ డ్రీమ్. ‘కూలీ’లో కలిసి పనిచేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌లో పాల్గొన్నాను. సన్ ఆఫ్ సత్యమూర్తి, గని చిత్రాల తర్వాత తెలుగు నుంచి కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ నా ఇతర సినిమాల వల్ల కుదరలేదు.