రూపవతిపై ఊరేగిన ఉజ్జయిని మహంకాళి.. లష్కర్​లో ధూంధాంగా ఫలహాబండ్ల వేడుక

రూపవతిపై ఊరేగిన ఉజ్జయిని మహంకాళి.. లష్కర్​లో ధూంధాంగా ఫలహాబండ్ల వేడుక

సికింద్రాబాద్, వెలుగు: లష్కర్​బోనాల ఉత్సవాల్లోని ఆఖరి ఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. అనంతరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని రూపపతి(ఏనుగు)పై ఊరేగించారు. ఆలయం నుంచి మొదలైన అంబారీ ఊరేగింపు సికింద్రాబాద్​ పురవీధుల మీదుగా సాగింది. దారిపొడవునా వేల మంది భక్తులు అమ్మవారికి స్వాగతం పలికారు.

పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య అంబారీ ఊరేగింపు ధూంధాంగా సాగింది. సాయంత్రం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు ఫలహార బండ్ల ఊరేగింపుతో ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి తొట్టెలు సమర్పించారు. అంతకు ముందు రంగం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కొత్త విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.

అన్ని వర్గాలతో మాట్లాడి, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేబినెట్​ మీటింగులో చర్చిస్తామన్నారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలను సక్సెస్ ​చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంట హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జ్​ డాక్టర్ కోట నీలిమ, ఆలయ అధికారులు ఉన్నారు.