బోనమెత్తిన లష్కర్.. వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

బోనమెత్తిన లష్కర్.. వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు
  •  వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు
  • అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన  సీఎం రేవంత్​ రెడ్డి 
  • తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
  • నేడు రంగం, ఫలహార బండ్లు .. అంబారీపై అమ్మవారి ఊరేగింపు

హైదరాబాద్, సికింద్రాబాద్, వెలుగు : ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి లష్కర్​బోనమెత్తింది. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మహిళల బోనాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలతో మహంకాళి ఆలయ పరిసరాలు కళకళలాడాయి. హైదరాబాద్​ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​ కుటుంబ సమేతంగా అమ్మవారికి ఉదయం 3.30 గంటలకే తొలిబోనం, పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 

ఉదయం 5 గంటలకు సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్నం తర్వాత భక్తుల రద్దీ పెరుగుతూ వచ్చింది. అమ్మవారి దర్శనానికి సిటీ నుంచే కాకుండా జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం నుంచి భక్తుల తాడికి పెరగడంతో పోలీసులు, వలంటీర్లు ఎప్పటికప్పుడు క్యూలైన్లను క్లియర్ చేశారు. ఒకవైపు వీఐపీలు వస్తున్నప్పటికీ వారి దర్శనంతోపాటు సాధారణ భక్తుల దర్శనాలను కూడా కొనసాగించారు. 

ఉత్సవాలకు వచ్చే భక్తులుఇబ్చందులు పడకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండ్రోజుల పాటు ఉత్సవాలు జరగనుండగా.. సోమవారం ఉదయం రంగం, సాయంత్రం ఫలహారపు బండ్లు, తొట్టెలు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు.

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం

మహంకాళి ఆలయానికి ఉదయం 8.20 గంటలకు చేరుకున్న సీఎం రేవంత్​రెడ్డి.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  సీఎం వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్​యాదవ్,  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్ మున్షీ , టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ కోట నీలిమ ఉన్నారు.  

అనంతరం మహంకాళి అమ్మవారి బోనాల జాతరపై సీఎం రేవంత్​ ఎక్స్​(ట్విట్టర్​)లో ట్వీట్ చేశారు. ఉజ్జయిని మహంకాళి ఆమ్మవారి చల్లనిచూపుతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని  కోరుకున్నట్టు చెప్పారు. పాడిపంటలతో రైతులు,  ఆర్థిక స్వావలంబనతో మహిళలు, శక్తి సామర్థ్యాలతో యువత, పేదల జీవన ప్రమాణాలు మెరుగుదలతో యావత్ రాష్ట్రం సుఖ శాంతులతో వర్దిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. 

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

బోనాల జాతర సందర్భంగా మహంకాళి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు వీ హనుమంతరావు, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యులు  డాక్టర్ లక్ష్మణ్​, అనిల్ కుమార్​యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ మంత్రి మల్లారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీజేపీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్​రెడ్డి,  రాష్ట్ర  ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, నగర మేయర్​ గద్వాల్​ విజయలక్ష్మి, రాష్ట్ర దేవాదాయ శాఖ  కార్యదర్శి శైలజా రామయ్యర్, నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. 

పోలీసుల అత్యుత్సాహం...

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దివంగత పీజేఆర్​ కూతురు, ఖైరతాబాద్ కార్పొరేట ర్​ విజయారెడ్డి.. అమ్మవారిని దర్శించుకోవడానికి కారులో  వస్తుండగా ప్యారడైజ్​వద్ద ఆమెను అడ్డుకున్నారు.  పాస్​ చూపిస్తేనే అనుమతిస్తామని చెప్పడంతో..  విజయారెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. 5 నిమిషాల తర్వాత పోలీసులు ఆమెను లోనికి అనుమతించారు. 

శివసత్తుల కోసం ప్రత్యేక టైమ్

ఆలయానికి వచ్చే శివసత్తులు (శివశక్తులు) బోనాలు సమర్పించేందుకు  వారికి ఆలయ నిర్వాహకులు ప్రత్యేక సమాయాన్ని కేటాయించారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారికి  ఆలయ ప్రధాన ద్వారం నుంచి నేరుగా ప్రవేశం కల్పించారు. దీంతో శివసత్తులు బోనాలతో శివాలెత్తి తూలుతూ, ఆడుతూ ఆమ్మవారిని దర్శించుకున్నారు.  బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.

నేడు రంగం.. అంబారీపై అమ్మవారి  ఊరేగింపు: ఆలయ ఈవో మనోహర్​ రెడ్డి

దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి  చెప్పారు. బోనాల సమర్పణ సోమవారం కూడా కొనసాగుతుందని, అదే రోజు ఉదయం రంగం కార్యక్రమం ఉంటుందని వివరించారు. సాయంత్రం ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు, పోతరాజుల నృత్యాలు, బలిగంప, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు.

తొలి బోనం సమర్పించిన పొన్నం దంపతులు

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పొన్నం మాట్లాడుతూ.. సకాలంలో మంచి వర్షాలు పడి.. పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.

 ఈ నెల 28న లాల్ దర్వాజా బోనాలు, తర్వాత రంగం, అంబారీ ఊరేగింపు కార్యక్రమాలు విజయవంతమయ్యేందుకు స్థానిక ప్రజలసహకారం కావాలని కోరారు. మహాలక్ష్మి పథకం వల్ల ఉత్సవాలకు మహిళలు ఎక్కువగా హాజరయ్యే చాన్స్​ ఉందన్నారు. హైదరాబాద్​ ప్రజలు మహిళలకు ఆతిథ్యం ఇచ్చి, పండుగను సక్సెస్​ చేయాలని కోరారు.  

అమ్మవారిని తొలిసారి దర్శించుకున్న మంత్రి సీతక్క

 మంత్రి సీతక్క  ఆదివారం మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీతక్కకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి సీతక్క పట్టువస్త్రాలు సమర్పించి, పూజల్లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తాను  మహంకాళి అమ్మవారి ఆలయానికి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 

బోనం సమర్పించిన కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి 

కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్​ రెడ్డి కుటుంబ సమేతంగా మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మంగళ వాయిద్యాలతో ఆయనకు  స్వాగతం పలికారు. వందల ఏండ్లుగా బోనాల పండుగ పరంపర కొనసాగుతున్నదని, వివిధ జిల్లాలే కాకుండా, పలు రాష్ట్రాలనుంచి కూడా భక్తులు  వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని కిషన్​రెడ్డి అన్నారు.  దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.