- ఆయిల్ కంపెనీలకు ఇప్పటికేరూ.1,650 కోట్లు విడుదల
- 10.35 కోట్లకు చేరనున్న పీఎంయూవై లబ్ధిదారులు
- రూ.7,210 కోట్లతో ఈ-కోర్ట్ ప్రాజెక్టు–3
- కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ : దేశ ప్రజలకు వినాయక చవితికి ముందే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) స్కీమ్ కింద రానున్న మూడేండ్లలో మరో 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు నిధులు కూడా విడుదల చేసినట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
పీఎంయూవై స్కీమ్‌లో భాగంగా ఆయిల్ కంపెనీలకు రూ.1,650 కోట్లు రిలీజ్ చేశామని వివరించారు. ఈ నిర్ణయంతో మరింత మంది నిరుపేద, మహిళలు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా మంజూరు చేసిన 75 లక్షల ఉజ్వల కనెక్షన్లతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం పీఎంయూవై స్కీమ్ లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుతుందని తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాల్లోని మహిళల కోసం 2016, మేలో ప్రధాని నరేంద్ర మోదీ పీఎంయూవై స్కీమ్ తీసుకొచ్చారని గుర్తు చేశారు.
ఫస్ట్ రీఫిల్, గ్యాస్ స్టౌ ఫ్రీ
ఉజ్వల 2.0లో భాగంగా లబ్ధిదారులకు 2023–24 నుంచి 2025-–26 వరకు 75 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఉజ్వల స్కీమ్ కింద 14.2 కిలోల రీఫిల్‌పై రూ.200 సబ్సిడీతో ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. రూ.2,200 కనెక్షన్‌కు (14.2 కిలోల సింగిల్ రీఫిల్/5 కిలోల డబుల్ రీఫిల్), రూ.1,300 కనెక్షన్‌కు (5 కిలోల సింగిల్ రీఫిల్) అందజేస్తామన్నారు. ఫస్ట్ రీఫిల్, గ్యాస్ స్టౌ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇంకా చాలామంది అర్హులకు గ్యాస్ కనెక్షన్లు లేవని కేంద్రం గుర్తించి ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. ప్రతి ఏడాది పాపులేషన్ పెరుగుతోందని, పెండ్లిళ్లు, వలసలు, కుటుంబాలు విడిపోవడం కారణంగా కనెక్షన్ల అవసరం పెరిగిందన్నారు. కుటుంబాల సంఖ్య కూడా పెరుగుతున్నదని తెలిపారు. 2023, ఆగస్టు 31 నాటికి 15 లక్షల గ్యాస్ కనెక్షన్ల డిమాండ్ రికార్డు అయిందన్నారు.
ALSO READ: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ..951 గ్రాముల బంగారం సీజ్
న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్
రూ.7,210 కోట్లతో నాలుగేండ్లలో ఈ–కోర్ట్స్ ప్రాజెక్ట్ ఫేజ్ 3ని అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. దీనికి కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్’ నినాదంతో ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఈ – కోర్ట్స్ మిషన్ ప్రాజెక్ట్ చేపట్టారని వివరించారు. నేషనల్ ఈ–గవర్నెన్స్ ప్లాన్‌లో భాగంగా.. భారతీయ న్యాయ వ్యవస్థ ఐసీటీ ఎనేబుల్మెంట్ కోసం ఈ ప్రాజెక్ట్ 2007 నుంచి అమల్లో ఉందన్నారు.
సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్ 2023లో ముగుస్తుందని తెలిపారు. ఫేజ్ 3 ఈ – కోర్ట్స్ ప్రాజెక్ట్ 2023లోనే ప్రారంభమవుతుందని వివరించారు. ఫేజ్3లో లెగసీతో పాటు మొత్తం కోర్టు రికార్డులను డిజిటల్ రూపంలో మారుస్తామన్నారు. దీంతో డిజిటల్, ఆన్లైన్, పేపర్‌లెస్ కోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. కోర్టు కాంప్లెక్స్‌ల్లో 4,400 ఈ-– సర్వీసు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. డిజిటలైజేషన్‌తో కేసుల షెడ్యూల్ ఎప్పటికప్పుడు తెలుస్తుందని వివరించారు. ప్రాధాన్యతా క్రమంలో జడ్జీలు, రిజిస్ట్రీలు కేసులు విచారించే చాన్స్ ఉంటుందని తెలిపారు. జ్యుడీషియరి సిస్టమ్‌ను టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడమే ఫేజ్ 3 ముఖ్య ఉద్దేశమన్నారు.