యునైటెడ్ కింగ్ డమ్.. యూకేలో పోలింగ్ బూతులు ఓపెన్ అయ్యాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలు తెరుచుకున్నాయి. ఓటర్లు తమ తమ ఓటు వేయటానికి తరలి వస్తున్నారు. ఓటర్ల ఉత్సాహం కోసం.. ఉదయమే తన భార్యతో కలిసి ఓటు వేశారు ప్రధాని రిషి సునాక్, అతని భార్య అక్షత మూర్తి. కిర్బీ సిగ్ స్టన్ గ్రామంలోని ఓ పోలింగ్ బూతులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
2024, జూలై 4వ తేదీ ఇంగ్లాండ్, నార్త్ ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ దేశాల్లో 40 వేల పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభం అయ్యింది. రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఈ నాలుగు దేశాల్లో 650 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా అధికారంలోని కన్జర్వేటివ్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం అయిన లేబర్ పార్టీల మధ్యే పోటీ ఉంది. 14 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని.. లేబర్ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని 80 శాతం సర్వేలు చెప్పాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ, వైద్యం, ఉద్యోగాలు అనే మూడు అంశాలపైనే యూకే ప్రజలు ఈసారి ఎన్నికల తీర్పు ఇవ్వనున్నారు.