తెలంగాణలో యూకే టెక్నాలజీ సెంటర్ .. తొలి విడతలో 600 మందికి ఉపాధి

యూకేకి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం లాయిడ్స్ గ్రూప్ తెలంగాణలో టెక్నాలజీ సెంటర్ ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈమేరకు ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ లో పర్యటించారు. తమ టెక్నాలజీ సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రకటించేందుకు చాలా సంతోషంగా ఉందంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

5వారాల్లోనే..

మంత్రి కేటీఆర్  ఇటీవల యూకే, అమెరికా పర్యటనలో భాగంగా లాయిడ్స్ గ్రూప్ ప్రతినిధులను  కలిశారు. మే 13న లండన్ లో లాయిడ్స్ గ్రూప్ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. తెలంగాణ ప్రత్యేకతలను వివరించారు. ఆ సమావేశంలో లాయిడ్స్ గ్రూప్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. అక్కడ సీన్ కట్ చేస్తే కేవలం ఐదు వారాల్లోనే ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ తమ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకి తెలంగాణ అనుకూలంగా ఉందని అన్నారు. 

తెలంగాణకు గర్వకారణం

 యూకే బ్యాంకింగ్ రంగంలో లాయిడ్స్ గ్రూప్ కి మంచి పేరుంది. 2.6కోట్ల మంది కస్టమర్లు ఈ బ్యాంక్ కి ఉన్నారు. అంతటి పేరున్న బ్యాంక్ హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణం అంటున్నారు మంత్రి కేటీఆర్. తొలి విడతలో 600మంది నిపుణులను లాయిడ్స్ గ్రూప్ నియమించుకుంటుంది. ఆ తర్వాత కార్యకలాపాలను మరింత విస్తరించిన  తర్వాత ఈ సంఖ్యను పెంచుతుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లోని బి ఎఫ్ ఎస్ ఐ ఈకో సిస్టంకు లాయిడ్స్ బ్యాంక్ టెక్నాలజీ సెంటర్ మరింత బలోపేతం చేస్తుందన్నారు టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకి లాయిడ్స్ గ్రూప్ రెడీ కావడంతో మంత్రి కేటీఆర్ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో  అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయడం....  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారులకు  సుస్థిరమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని లాయిడ్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాన్ వాన్ కేమెనడే తెలిపారు. టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుతో తమ సంస్థకు మరిన్ని అవకాశాలు కలుగుతాయన్న  విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన, హైదరాబాద్ లో ఉన్న అద్భుత మానవ వనరులు, వారి నైపుణ్యం, ఇన్నోవేషన్ రంగంలో ఉన్న వారి ప్రతిభ తమ సంస్థ పురోగతికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ఆశాభావం  వ్యక్తం చేశారు.