భద్రతామండలిని విస్తరించాలి.. భారత్​కు మేమూ మద్దతిస్తున్నం: యూఎన్ జీఏలో బ్రిటన్ ప్రధాని

భద్రతామండలిని విస్తరించాలి.. భారత్​కు మేమూ మద్దతిస్తున్నం: యూఎన్ జీఏలో బ్రిటన్ ప్రధాని

న్యూయార్క్:  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు తేవాలని, శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలన్న భారత్ ప్రతిపాదనకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా మద్దతు తెలిపారు. న్యూయార్క్​లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్ జీఏ) 79వ సెషన్ సమావేశాల సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్ కూడా భారత్​కు మద్దతు తెలిపారు. ప్రపంచ వేదికపై కీలక స్థానంలో ఉన్న భారత్​కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.

యూఎన్ జీఏలో గురువారం బ్రిటన్ ప్రధాని స్టార్మర్ మాట్లాడారు. ‘‘భద్రతా మండలి మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం ఉన్న సంస్థగా మారాలి. రాజకీయాల కారణంగా ఈ సంస్థ స్తంభించిపోకూడదని కోరుకుంటున్నా. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీలతో సహా ఆఫ్రికన్ కౌన్సిల్​కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. అలాగే భద్రతా మండలిలో విడతలవారీగా ఎన్నుకునే సభ్యుల సంఖ్యనూ పెంచాలని కోరుకుంటున్నాం” అని కీర్ స్టార్మర్  స్పష్టం చేశారు.