ట్రంప్​ బాటలో కీర్ స్టార్మర్..బ్రిటన్​లో అక్రమ వలసదారులను గెంటేస్తున్నారు

ట్రంప్​ బాటలో కీర్ స్టార్మర్..బ్రిటన్​లో అక్రమ వలసదారులను గెంటేస్తున్నారు
  • ఇండియన్  రెస్టారెంట్లలో అధికారుల సోదాలు

లండన్:అక్రమ వలసలపై అమెరికా ప్రెసిడెంట్ కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు ట్రంప్​ బాటలోనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నడుస్తున్నారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి, వారిని తిప్పి పంపేందుకు ‘యూకే వైడ్ బ్లిట్జ్’ పేరుతో ఆపరేషన్ చేపట్టింది. 

ఇందులో భాగంగా ఇండియన్లు పనిచేసే రెస్టారెంట్లు, నెయిల్  బార్స్ (గోళ్లకు రంగులు వేసే, డిజైన్లు చేసే బార్లు), కార్  వాష్​  కేంద్రాలు, గ్రాసరీ స్టోర్లను ప్రభుత్వం టార్గెట్ గా చేసుకున్నది. ఎక్కడికక్కడ అక్రమ వలసదారులను గుర్తించి తరలిస్తున్నది. 

బ్రిటన్ హోంసెక్రటరీ వెట్ కూపర్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. గత నెలలో 828 ప్రాంతాల్లో సోదాలు చేపట్టి 609 మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. అన్ని రంగాల్లోనూ అక్రమంగా పనిచేస్తున్న వలసదారులను ఇంటెలిజెన్స్  సమాచారం ఆధారంగా గుర్తిస్తున్నామని, గత నెలలో రెస్టారెంట్లు, టేక్ అవేస్, కెఫేస్, ఫుడ్, డ్రింక్, టొబాకో పరిశ్రమల్లో భారీ ఎత్తున సోదాలు చేశామని అధికారులు తెలిపారు. 

ఉత్తర ఇంగ్లండ్ లోని హంబర్ సైడ్ లో ఒక ఇండియన్  రెస్టారెంట్ లో తనిఖీ చేసి ఏడుగురిని అరెస్టు చేశామని చెప్పారు. ‘‘ఇమిగ్రేషన్  రూల్స్ తప్పనిసరిగా ఆచరణలో పెట్టాలి. ఇప్పటివరకు అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో చాలా మంది అక్రమంగా వచ్చి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు” అని వెట్  కూపర్   వెల్లడించారు.