బెలారస్‌ వేదికగా రష్యాతో శాంతి చర్చలకు నో

కీవ్: తమపై ఏకపక్షంగా యుద్ధం ప్రారంభించిన రష్యాతో శాంతి చర్చలకు సానుకూలత వ్యక్తం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ.. బెలారస్‌ వేదికగా రష్యాతో శాంతి చర్చలకు నో చెప్పారు. బెలారస్ రష్యా అనుకూల ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని రష్యా తమ దండయాత్రకు లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. రష్యా బెలారస్‌కు ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతామని ప్రకటించి.. గోమెల్ నగరంలో ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.

అయితే ఈ ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ  తిరస్కరించారు.  బెలారస్ నుండి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోందని, తన దేశం పట్ల దూకుడు ప్రదర్శించని ప్రదేశాలలో మాత్రమే చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి ఆమోదయోగ్యమైన స్థానాల్లో వార్సా, ఇస్తాంబుల్ బ్రాటిస్లావా, బుడాపెస్ట్ మరియు బాకు ఉన్నాయి. ‘క్షిపణులు ఎగరని ఏ దేశంలోనైనా చర్చలకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పష్టం చేశారు.