
- జెడ్డాలో అమెరికాతో చర్చలు సఫలం
- 30 రోజుల సీజ్ ఫైర్‌కు అంగీకరించిన ఉక్రెయిన్
- ఇప్పుడు బంతి రష్యా కోర్టులో ఉందన్న అమెరికా
- పుతిన్ కూడా ఓకే అంటారని భావిస్తున్నానన్న ట్రంప్
- ట్రంప్, పుతిన్ త్వరలోనే మాట్లాడుకుంటరన్న రష్యా
జెడ్డా: రష్యాతో కాల్పుల విరమణ పాటించి, వెంటనే శాంతి చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అంగీకరించింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో మంగళవారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ ప్రతినిధి ఆండ్రీ యెర్మాక్ నేతృత్వంలోని బృందాలు కొన్ని గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపాయి. సమావేశం తర్వాత రూబియో, ఆండ్రీ సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించిందని మార్కో రూబియో ప్రకటించారు.
ఇప్పుడు బంతి రష్యా కోర్టులో ఉందని, కాల్పుల విరమణకు ఆ దేశం కూడా ఒప్పుకుంటుందని భావిస్తున్నామని చెప్పారు. శాంతి చర్చలకు, కాల్పుల విరమణకు సిద్ధంగా ఉందా? లేదా? అన్నది ఆ దేశం స్పష్టంగా తేల్చిచెప్పాలన్నారు. కాల్పుల విరమణపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే మాట్లాడతారని వెల్లడించారు. ఒకవేళ కాల్పుల విరమణకు రష్యా అంగీకరించకపోతే మాత్రం శాంతి ప్రక్రియకు ఆటంకం ఏర్పడినట్టే అవుతుందన్నారు. అలాగే, ఉక్రెయిన్ 30 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపినందున ఆ దేశానికి ఇదివరకు నిలిపివేసిన మిలిటరీ సాయం, ఇంటెలిజెన్స్ సహకారాన్ని వెంటనే పునరుద్ధరిస్తున్నట్టు మార్కో ప్రకటించారు. ఉక్రెయిన్ లో అమెరికా ఖనిజాల తవ్వకానికి సంబంధించి కూడా అతి త్వరలోనే డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. కాగా, సీజ్ ఫైర్ ప్రతిపాదన చేసినందుకు ట్రంప్ కు జెలెన్ స్కీ ధన్యవాదాలు తెలిపారు. రష్యా కూడా డీల్ కు అంగీకరించేలా చూడాలని కోరారు.
పుతిన్ అంగీకరిస్తారని అనుకుంటున్నా: ట్రంప్
రష్యాతో 30 రోజుల పాటు కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించినందున, ఆ డీల్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఒప్పుకుంటారని ఆశిస్తున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. మంగళవారం వైట్ హౌస్ ఆవరణలో బిలియనీర్ ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా నుంచి కొనుగోలు చేసిన కారులో కొద్ది సేపు ప్రయాణించిన సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పుడు మేం రష్యాను సంప్రదించాల్సి ఉంది.
ప్రెసిడెంట్ పుతిన్ కూడా ఈ డీల్ కు ఒప్పుకుంటారని అనుకుంటున్నా” అని ఆయన తెలిపారు.
అతిత్వరలోనే ట్రంప్, పుతిన్ చర్చిస్తారు: రష్యా
ఉక్రెయిన్ మంగళవారం కాల్పుల విరమణకు అంగీకరించిన వెంటనే ఆ దేశానికి అమెరికా తిరిగి మిలిటరీ, ఇంటెలిజెన్స్ సాయాన్ని ప్రారంభించిన నేపథ్యంలో రష్యా బుధవారం స్పందించింది. అతి త్వరలోనే పుతిన్, ట్రంప్ ఫోన్ లో మాట్లాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని రష్యా ప్రెసిడెంట్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెష్కోవ్ ప్రకటించారు. పుతిన్, ట్రంప్ గత నెల 12న కూడా మాట్లాడుకున్నారని, ఉక్రెయిన్ లో యుద్ధం ఆపడం, ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర అంశాలపై చర్చించారని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అతిత్వరలోనే వారిద్దరూ మరోసారి మాట్లాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.