
వాషింగ్టన్: మూడేళ్లగా సాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యాతో తాత్కలిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా మంగళవారం (మార్చి 11) జరిగిన భేటీలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ, అమెరికా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, యుద్ధం ముగింపుపై చర్చించారు. ఈ భేటీలో రష్యాతో 30 రోజుల కాల్పుల విరణమణకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది.
ఈ విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మాస్కోతో కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించడాన్ని ట్రంప్ స్వాగతించారు. సీజ్ ఫైర్‌కు రష్యా కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరువైపులా సైనికులు, పౌరులు మరణించడం విచారకరమని.. ఇక దీనికి ముగింపు పలకాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. యుద్ధం ముగింపులో కాల్పుల విరమణ చాలా కీలకమైనదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read :- అప్పుడు షేర్లు రూ.300 లకు కొంటే ఇప్పుడు ఎన్ని లక్షలో తెలుసా
మూడేళ్ల రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడమే కాల్పుల విరమణ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే.. భద్రతా సహాయాన్ని తిరిగి ప్రారంభించాలని వైట్ హౌస్ నిర్ణయించింది. ‘‘కాల్పుల విరమణకు ఉక్రెయిన్ను ఒప్పించాం. ఇక రష్యాతో మాట్లాడాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా దీనికి అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. యుద్ధం కారణంగా ఇరుదేశాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. సామాన్య పౌరులు మృతి చెందుతున్నారు. ఇక ఆ యుద్ధాన్ని అంతం చేయాలనుకుంటున్నాం’’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాల్పుల విరణమనకు అంగీకరించడంతో ఉక్రెయిన్‌తో నిఘా సమాచార మార్పిడిపై అమెరికా తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసింది.