ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ఎనిమిదో రోజు కొనసాగుతోంది. క్షిపణులు, బాంబు దాడులతో విచుకుపడుతూ రష్యన్ బలగాలు.. ఒక్కో సిటీని తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నాయి. అయితే దాదాపు ఐదారు రోజులుగా రాజధాని కీవ్ సిటీని మాత్రం రష్యన్ సైనికులు స్వాధీనపరుచుకోలేకపోతున్నారు. ఉక్రెయిన్ ఆర్మీ తమ రాజధానిని కాపాడుకునేందుకు భీకరంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో రష్యాకు మరోసారి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వార్నింగ్ ఇచ్చారు. తమ దేశం వదిలి వెళ్లిపోవాలని రష్యన్ సైనికులకు సూచించారు. ‘‘మీ డెడ్ బాడీలతో మా దేశం నిండిపోవాలని నేను కోరుకోవడం లేదు. తక్షణం ఉక్రెయిన్ విడిచి.. మీ ఇండ్లకు వెళ్లిపోండి’’ అని హెచ్చరించారు. ఇప్పటికే తొమ్మిది వేల మంది రష్యన్ సైనికులను హతమార్చామని జెలెన్సీ చెప్పారు. ఇంకా మరింత మంది తమ చేతుల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు.
వాళ్లు యుద్ధం ఎందుకు చేస్తున్నారో తెల్వదు
రష్యా సైనికులు తామెందుకు యుద్ధం చేస్తున్నామో కూడా తెలియకుండా, దశ దిశ లేకుండా ముందుకు సాగుతున్నారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అన్నారు. అసలు వాళ్లు ఉక్రెయిన్ లో ఎందుకు ఉన్నారో కూడా వారికి తెలియదని అన్నారు. ‘‘ఉక్రెయిన్ సైనికులు, సామాన్య పౌరులు, రైతులు కూడా రోజూ రష్యన్ సైనికులను ఈజీగా బందీలుగా చేసుకుంటున్నారు. వాళ్లను అడిగితే ఏ ఒక్కరూ యుద్ధం ఎందుకు చేస్తున్నారో చెప్పలేకపోతున్నారు’’ అని ఆయన చెప్పారు. రష్యా దురాక్రమణ ఎందుకోసం జరుగుతోందో, అసలు ఖెర్సన్ ను ఎందుకు ఆక్రమించారో కూడా వాళ్లకు తెలియదని జెలెన్స్కీ అన్నారు.