రష్యా‌‌‌‌‌‌‌‌, ఉక్రెయిన్​ వార్​లో ఇండియా పాలసీ కరెక్టేనా?

రష్యా, ఉక్రెయిన్​ వార్​ ఇప్పుడు మొత్తం ప్రపంచాన్నే వణికిస్తోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే భయాలు కూడా అంతటా నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా–ఉక్రెయిన్​ విషయంలో మనదేశం న్యూట్రల్​గా వ్యవహరిస్తోంది. న్యూట్రల్​ అంటే రష్యాకు అనుకూలమేనా? ఉక్రెయిన్​కు మద్దతుగా నిలవాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తున్నా ఇండియా ఎందుకు స్పందించడం లేదు? రష్యా వ్యతిరేక వైఖరి తీసుకుంటే మనకు వచ్చే నష్టమేంటి? అసలు ఇండియా స్టాండ్​ కరెక్టేనా? న్యూట్రల్​గా ఉండటం వల్ల భవిష్యత్​లో వచ్చే సమస్యలేంటి?

విదేశీ వ్యవహారాల విషయంలో ఏ దేశానికైనా కూడా అనుకోని సవాళ్లు వస్తూనే ఉంటాయి. అందుకే ఫారిన్​ పాలసీ విషయంలో ఏ దేశమైనా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఫారిన్​ పాలసీని రూపొందించుకుంటూ వస్తున్నాయి మన ప్రభుత్వాలు. ముఖ్యంగా స్వాతంత్ర్యం రాగానే మన దేశానికి మొదటి చాలెంజ్..​బ్రిటన్, అమెరికా నుంచి కాశ్మీర్  విషయంలో ఎదురైంది. అంతర్జాతీయ సమాజం ముందుకు కాశ్మీర్ అంశాన్ని తీసుకొచ్చిన బ్రిటన్, అమెరికా.. ఈ విషయంలో పాకిస్తాన్​కు అన్యాయం జరిగిందని, అక్కడి నుంచి ఇండియా సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్​ను తెరపైకి తెచ్చాయి. ఆ సమయంలో మనకు అండగా నిలిచింది.. సహాయపడింది రష్యానే. వీటో వాడి అంతర్జాతీయ సమాజంలో ఆ సబ్జెక్ట్ పై చర్చ జరగకుండా చేసి మనకు చాలా మేలు చేసింది. యునైటెడ్​ నేషన్స్​ పద్ధతి ఏమిటంటే.. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ ఈ ఐదు దేశాల్లో ఒక్క దేశమైనా వీటో పెడితే ఆ అంశంపై చర్చించడానికి వీలు లేదు. 

ఇండియాకు అతి పెద్ద చాలెంజ్

రష్యా ఎప్పుడైతే.. ఉక్రెయిన్​ను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిందో అప్పుడే మనకు  అతి పెద్ద చాలెంజ్​ ఎదురైంది. అది ఏమిటంటే.. మనం రష్యాకు నష్టం కలిగించలేం. ఈ రోజుకు కూడా మనకు అంతర్జాతీయ సమాజంలో రష్యా అవసరం అన్ని రకాలుగా ఉంది. మనకు 60 శాతం ఆయుధాలు, ఆయిల్, ఇతర వస్తువులు రష్యా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రష్యాను మనం వ్యతిరేకించలేం. రెండో అంశం ఏమిటంటే.. ఉక్రెయిన్​ విషయంలో రష్యాను చైనా ప్రోత్సహించింది. ఉక్రెయిన్​ను స్వాధీనం చేసుకునే హక్కు రష్యాకు ఉందని, అన్ని రకాలుగా సహాయం చేస్తామంటూ ముందుకు తోసింది. చైనా, రష్యాతో సంబంధాలను పెంచుకుంటున్న నేపథ్యంలో మనం ఇప్పటికీ రష్యాతో సంబంధాలు కొనసాగించాలి. మూడోది చైనా, ఇండియాకు మధ్య ఎంతో కాలంగా సరిహద్దు గొడవ జరుగుతోంది. ఈ విషయంలో ఏ దేశం కూడా చైనాకు నీతులు చెప్పలేదు. ఒక్క ఆస్ట్రేలియా తప్ప ఏ దేశం కూడా మనకు మద్దతుగా ముందుకు రాలేదు. చైనా వైఖరిని ఖండించ లేదు. పాకిస్తాన్​ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. చైనా, పాక్ విషయంలో ఆయా దేశాలు వాళ్ల జాగ్రత్తలు అవి చూసుకున్నాయి.

మాట సాయం తప్ప ముందుకు రాలే

ఇక అమెరికా, నాటో లోని 30 దేశాలు ఉక్రెయిన్​కు మాట సాయం చేస్తున్నాయి కానీ, మరే విధంగానూ సాయం చేయడం లేదని ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్స్కీనే అంటున్నారు. వారే ఎలాంటి సాయం చేయనప్పుడు భారత్​ నోరు తూలి వారికి మద్దతు పలకడం వల్ల మనకు వచ్చే లాభమేంటి.. ఉక్రెయిన్​కు లాభమేంటి. నైతికత విషయంలో ఇండియా చేయాల్సినంత చేస్తోంది. పుతిన్​తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్​లో మాట్లాడి రెండు దేశాల మధ్యా పరిస్థితులను చక్కదిద్దాలని చెప్పినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలో ఏ దేశానికీ 7 వేల కిలోమీటర్ల సరిహద్దుల్లో రెండు బలమైన శత్రుదేశాలు లేవు. కానీ మనదేశానికి చైనా, 
పాకిస్తాన్​ లాంటి దేశాలు 70 ఏండ్లుగా పక్కలో బల్లెంలా మారాయి. వాటిని ఎదుర్కోవడమే ఇన్నాళ్లు మనకు ఫుల్​ టైం పని అయిపోయింది. ప్రభుత్వానికి, రక్షణ శాఖకు, విదేశాంగ శాఖకు ఎంతో సమయం, నిధులను ఇందుకోసమే కేటాయించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు నేరుగా సహాయం చేసిన దేశం రష్యా మాత్రమే. రష్యా మనకు స్నేహంగా ఎంత వరకు ఉంటుందనేది తెలియదు కానీ, దానిని శత్రు దేశంగా మార్చుకోకుండా ఉండటమే మన ముందున్న మంచి ఆప్షన్.

మన ప్రయోజనాలు కాపాడుకోగలిగాం

ఒకానొక సమయంలో ఇండియా నాన్​ అలైన్​మెంట్ దారిలో నడిచింది. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం అనుసరించిన పంథా ఇది. ఇది 1990లో కోల్డ్​ వార్​ ముగిసే వరకు కొనసాగింది. న్యూట్రల్​గా ఉండటం ద్వారా ప్రతి అంశంపై మనం ఒక స్టాండ్​ను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సూపర్​పవర్స్​గా ఉండే దేశాలకు అనుకూలంగా ఉండే కొన్ని దేశాలు మాత్రమే ఒక స్టాండ్​ను తీసుకుంటాయి. కానీ, ఇండియా నాన్​ అలైన్​మెంట్​ను ఫాలో అవుతోంది. ఈ రోజు, అంతటా తీవ్రమైన గందరగోళం నెలకొన్న సమయంలో ఇండియా ఫారిన్​పాలసీలు తరచు మారుతూ ఉండాలి. పాత సిద్ధాంతాలు, పద్ధతులను మరిచిపోవాలి. రష్యా–ఉక్రెయిన్​ మధ్య న్యూట్రల్​గా ఉండాలని స్టాండ్​ తీసుకోవడం ద్వారా, ఇండియా తన ప్రయోజనాలను కాపాడుకోగలిగింది.

రష్యాపై ఆంక్షలు తక్కువగానే..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోనే పవర్​ఫుల్​ దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్​ తదితర దేశాలు ప్రతి రోజు రష్యా నుంచి రూ.5 వేల కోట్ల విలువైన ఆయిల్, నేచురల్​ గ్యాస్, మినల్స్, ఇతర రా మెటీరియల్​ను దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం, ఈ దేశాలు రష్యాపై అన్ని రకాలైన ఆంక్షలను కొద్ది మొత్తంలోనే విధించాయి. ఈ దేశాలు రష్యాతో వాణిజ్యంపై నిషేధం విధించలేదు. అలాగే బ్యాంకింగ్​ ట్రాన్స్ ఫర్​ మెకానిజం స్విఫ్ట్​ నుంచి రష్యాను తొలగించలేదు. ఒకవేళ రష్యాను స్విఫ్ట్​ నుంచి తొలగించినట్లయితే అది ఇతర దేశాలతో బ్యాంకింగ్​ వర్క్​ను కొనసాగించలేదు. అయితే ఈ దిశగా పవర్​ఫుల్​ కంట్రీస్​ ముందడుగు వేయలేదు. అంటే, రష్యాను ఎక్కువగా దూరం పెట్టకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాయి ఈ దేశాలు. 

గత అనుభవాలు ఎన్నో పాఠాలు నేర్పాయి

భారతదేశ ఫారిన్ పాలసీ బ్రిటిష్ కాలం అంటే దాదాపు 150 ఏండ్ల నుంచి కొనసాగుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించారనే అనుభవం మనకు ఉంది. ప్రతి తగవులో వేలు పెట్టొద్దని గత అనుభవాలు మనకు నేర్పుతున్నాయి. ఏ దేశమైన మార్పులు చేసుకోగలిగే ఫారిన్​ పాలసీని కలిగి ఉండాలి. అలాగే ఆయా దేశాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చాలా ఏండ్ల క్రితం, ఎన్నో ఇస్లామిక్​ దేశాలు పాకిస్తాన్​కు అనుకూలంగా వ్యవహరించాయి. కానీ, ఇండియా వాటికి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. ఎందుకంటే ఆయా దేశాల్లో పనిచేసే భారతీయులు ఎంతో మంది ఉన్నారు. దీనినే వ్యవహారిక వాదం అంటారు. అదే అత్యుత్తమ ఫారిన్​ పాలసీ.

ఉక్రెయిన్, రష్యా వార్​లో ఇంకా చాప్టర్స్​ ఉన్నయ్

‘‘దేవదూతలు నడవడానికి భయపడే చోట మూర్ఖులు పరిగెత్తుతారు”అంటూ గ్రేట్​ ఇంగ్లిష్​ రచయిత అలెగ్జాండర్​ పోప్​ ఒక మాట చెప్పారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలనేది ఆయన చెప్పిన మాట. రష్యా లేదా ఏదైనా సూపర్​ పవర్​కు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకునే విషయంలో భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దీని వల్ల దేశ ప్రయోజనాలు కూడా ప్రభావితం అవుతాయి. ఉక్రెయిన్​ అంశం రష్యా ప్రెసిడెంట్​ వ్లాదిమిర్​ పుతిన్​కు చాలా కీలకం. ఒకవేళ తనకు ఏం కావాలో అది పుతిన్​ సాధించలేకపోతే, అది ఆయన ముగింపునకు దారి తీస్తుంది. కానీ, పుతిన్​ తనకు ఎవరు మద్దతుగా నిలిచారు, ఎవరు న్యూట్రల్​గా ఉన్నారనేది మాత్రం గమనిస్తూనే ఉంటారు. ఉక్రెయిన్​–రష్యా వార్​ లో ఇప్పటికీ ఇంకా చాలా చాప్టర్లు ఉన్నాయి. ప్రస్తుత ఫారిన్​ పాలసీని అడ్జస్ట్​ చేసేందుకు సరిపడా సమయం మనకు ఉంది. అయితే మొత్తంగా ఇండియా స్టాండ్ తో అటు రష్యా, ఇటు ఉక్రెయిన్​ రెండూ సంతృప్తిగానే ఉన్నాయి.

వాళ్ల గౌరవం పోగొట్టుకున్నరు

రష్యా, ఉక్రెయిన్​ వార్​ విషయంలో ఇండియా యాక్టివ్​గా ఉండాలంటూ చాలా మంది సలహాలు ఇస్తున్నారు. వాళ్ల తగవు మధ్యలో మనం దూకాలని చెబుతున్నారు. గవర్నమెంట్​పైన కూడా ఈ విషయంలో అనేక విమర్శలు చేస్తున్నారు. కాగా, ఉక్రెయిన్​ తో ఉద్రిక్తతల నేపథ్యంలో గత నెలలో ఫ్రెంచ్​ ప్రెసిడెంట్​ ఎమాన్యుయెల్​ మెక్రాన్, జర్మన్​ చాన్స్​లర్ ఓలాఫ్​ స్కోల్జ్, బ్రిటిష్​ ఫారిన్​ మినిస్టర్ ఇంకా చాలా మంది ప్రపంచ నాయకులందరు మాస్కో వెళ్లి పుతిన్​తో మాట్లాడారు. కానీ 
ఈ విషయంలో వాళ్ల ఎవరి మాటనూ పుతిన్​ వినలేదు. దీంతో వాళ్ల గౌరవం, వారి దేశ గౌరవం పోయింది. అందువల్ల మన దేశం ఇలాంటి అవమానం కొని తెచ్చుకోకుండా దూరంగా ఉండి మంచిపని చేసింది. దీని వల్ల మన గౌరవం నిలబడింది.

మనకు ఉన్న ఆప్షన్స్​ చాలా తక్కువ

మనదేశానికి చాలా తక్కువ ఆప్షన్స్​ మాత్రమే ఉండటంతో అందుకు అనుగుణంగానే ఉక్రెయిన్​ ప్రభుత్వానికి చేతనైనంత వరకూ మాట సాయాన్ని అందిస్తోంది. 7 వేల కిలోమీటర్ల సరిహద్దులో ఎదుర్కొంటున్న ముప్పును మనదేశం అందరికీ అర్థమయ్యేలా వివరిస్తోంది. ఒకవైపు 2 లక్షల మంది చైనా సైనికులను, మరోవైపు లక్షలాది మంది పాక్​ జవాన్లను నిత్యం ఇండియా ఎదుర్కొంటోంది. అందువల్ల మనకు తక్కువ ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని ఇండియా అందరికీ తెలియజేయాలి. న్యూట్రల్​గా ఉండటమే ఇప్పుడు ఉక్రెయిన్ కు మనం చేసే గొప్ప సహాయం అవుతుంది. గత నెలలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో పవర్​ఫుల్​ దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ ఉక్రెయిన్​కు మద్దతుగా నిలిచే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. వాస్తవానికి, జర్మనీ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. ఉక్రెయిన్​కు ఎలాంటి సాయం చేసేందుకు ముందుకు రాలేదు. అయితే ఈ అంశం వివాదాస్పదం కావడంతో జర్మనీ ఉక్రెయిన్​కు 5 వేల హెల్మెట్లను పంపింది.

:: పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్