పక్క దేశాలకు నడిచి పోతున్రు

పక్క దేశాలకు నడిచి పోతున్రు

వార్సా: రష్యా దాడులతో ఉక్రెయిన్ అల్లాడుతోంది. బాంబు మోతలతో అక్కడి ప్రజలు భయభయంగా గడుపుతున్నారు. ఏం జరుగుతుందో తెలియక చంటి పిల్లలు హడలిపోతున్నారు. ఇళ్లను వదిలి బంకర్లలో, అండర్ గ్రౌండ్లలో దాక్కుంటున్నారు. కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశాన్ని వీడుతున్నారు. పిల్లలతో, సామాన్లతో, కన్నీళ్లతో పుట్టిన నేలను వీడుతున్నారు. ఇప్పటికే 1,20,000 మంది వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ అనుబంధ సంస్థలు వెల్లడించాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగొచ్చని ఐక్యరాజ్యసమితి హై కమిషనర్ ప్రతినిధి షబియా మంటూ తెలిపారు. పరిస్థితి మరింత దిగజారితే 4 మిలియన్ల మంది ఉక్రేనియన్లు పారిపోవచ్చని అంచనా వేశారు. చాలా మంది పొరుగున ఉన్న పోలాండ్, మోల్డోవా, హంగేరీ, రొమేనియా మరియు స్లోవేకియాకు వెళుతున్నారని, మరికొందరు బెలారస్‌‌లోకి వెళుతున్నారని మంటూ చెప్పారు. అత్యధిక సంఖ్యలో పోలాండ్‌‌కు చేరుకున్నట్లు తెలిపారు.