ఉక్రెయిన్ రష్యాలో కలవచ్చు: అమెరికా ప్రెసిడెంట్ ​ట్రంప్ ​కామెంట్స్

ఉక్రెయిన్ రష్యాలో కలవచ్చు: అమెరికా ప్రెసిడెంట్ ​ట్రంప్ ​కామెంట్స్
  • బందీల రిలీజ్​పై హమాస్​కు డెడ్​లైన్
  • విడుదల చేయకపోతే నరకం చూపిస్త
  • బెదిరింపులకు భయపడబోమన్న హమాస్​

వాషింగ్టన్: ఉక్రెయిన్ ఏదో ఒక రోజు రష్యాలో భాగం కావొచ్చంటూ అమెరికా ప్రెసిడెంట్​డొనాల్డ్  ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం ఫాక్స్ న్యూస్ చానెల్​కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉక్రెయిన్​ఏనాటికైనా రష్యాలో కలవాల్సిందేనని అన్నారు. ‘ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ముగిసిపోయి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరొచ్చు, అవి రెండూ కలిసిపోవచ్చు. ఒప్పందం కుదరకపోతే కలవకపోవచ్చు’ అని ట్రంప్ అన్నారు. 

ఏదేమైనా జరగనీ కానీ ఉక్రెయిన్ కు మేం చేస్తున్న సాయానికి ఎంతోకొంత ప్రతిఫలం ఆశిస్తున్నామని చెప్పారు. మా సాయానికి ప్రతిఫలంగా ఆ దేశం నుంచి అరుదైన ఖనిజాలను ఆశిస్తున్నామని చెప్పారు. ‘ఉక్రెయిన్ కు మేం చేస్తున్న సాయానికి ప్రతిఫలంగా ఆ దేశంతో రూ.500 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకోనున్నాం. ఇందుకు వాళ్లు అంగీకరించారు’ అని తెలిపారు. దీనివల్ల ఆ రెండు దేశాలు ఒక్కటైనా, కాకపోయినా సరే కనీసం తాము ఫూల్స్ కాకుండా ఉంటామని ట్రంప్ చెప్పుకొచ్చారు.

హమాస్​కు మరోసారి వార్నింగ్​

బందీలను విడుదల చేయాలని హమాస్​ను ట్రంప్ మరోసారి హెచ్చరించారు. మిలిటెంట్లు తాము బందించిన వారిని శనివారం (ఈ నెల 15) మధ్యాహ్నంలోగా విడుదల చేయాలని డెడ్ లైన్ విధించారు. లేదంటే నరకం చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తామని బెదిరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తున్నదని ఆరోపిస్తూ ఇలాగే కొనసాగితే బందీల విడుదల మరింత ఆలస్యమవుతుందని హమాస్ హెచ్చరించంతో ట్రంప్ స్పందించారు. సోమవారం వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘శనివారం మధ్యాహ్నంలోగా బందీలందరినీ హమాస్ విడుదల చేయాలి.

లేదంటే నరకం చూపిస్త. వాళ్లు ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాల్పుల విరమణ ఒప్పందం కూడా రద్దు చేస్తం. ఇది పూర్తిగా నా అభిప్రాయం. దీనిపై అంతిమ నిర్ణయం ఇజ్రాయెల్ దే’ అని తెలిపారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఈ నెల 15న ముగ్గురు బందీలను హమాస్ విడుదల చేయాలి. అయితే, ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయని హమాస్ మిలిటెంట్లు ఆరోపించారు. బందీల విడుదలపై ఈ చర్య ప్రభావం చూపుతుందని, రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందని హెచ్చరించారు. మధ్యవర్తులుగా ఉన్న దేశాలు ఇజ్రాయెల్​పై ఒత్తిడి తెచ్చి ఒప్పందాన్ని పాటించేలా చేయాలని కోరారు. 

బందీల విడుదలకు అదొక్కటే మార్గం: హమాస్

ట్రంప్ డెడ్ లైన్​పై హమాస్ స్పందించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని, బందీలు విడుదలయ్యేందుకు అదొక్కటే మార్గమనే సంగతి ట్రంప్​ గుర్తుంచుకోవాలని చెప్పింది. ‘ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దాన్ని రెండు దేశాలూ గౌరవించాలి. ఇజ్రాయెల్ బందీల విడుదలకు ఉన్న ఏకైక మార్గం కాల్పుల విరమణ ఒప్పందమే. ఇది ట్రంప్ గుర్తుంచుకోవాలి. బెదిరింపుల వల్ల సమస్యలు మరింత జఠిలం కావడం తప్ప ఒరిగేదేం ఉండదు’ అని హమాస్ ప్రతినిధి సమీ అబు జుహ్రీ అన్నారు.

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ముగిసిపోయి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరొచ్చు, అవి రెండూ కలిసిపోవచ్చు. ఉక్రెయిన్​కు మేం చేస్తున్న సాయానికి ఎంతోకొంత ప్రతిఫలం ఆశిస్తున్నాం. మా సాయానికి ప్రతిఫలంగా ఆ దేశం నుంచి అరుదైన ఖనిజాలను ఆశిస్తున్నాం. ఆ దేశంతో  రూ.500 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకోనున్నాం.  - డొనాల్డ్​ ట్రంప్​