ఉక్రెయిన్​ను వాడుకుంటున్న యూఎస్

ఉక్రెయిన్​ను వాడుకుంటున్న యూఎస్

రష్యా దండయాత్రతో 2022 ఫిబ్రవరి 24 మొదలైన ఉక్రెయిన్‌‌‌‌ – రష్యా యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది.  భారత దౌత్యాన్ని పరీక్షకు గురి చేసింది. ఒకవైపు రష్యా భారత్​కు మిత్ర దేశం కాగా, మరోవైపు అమెరికా ప్రజాస్వామ్య దేశంగా ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌‌‌‌ను అతిగా అనుకూలిస్తున్నది. ఇలాంటి తరుణంలో యునైటెడ్ స్టేట్స్‌‌‌‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ భారతదేశం అలీన విధానం ప్రాధాన్యతను పునరుద్ఘాటించింది. భారత్, జపాన్​తోపాటు మలబార్ ​త్రైపాక్షికంలో, జపాన్, ఆస్ట్రేలియా క్వాడ్రిలేటరల్​తో అమెరికాతో కలిసి ఉంటూ చైనాకు వ్యతిరేకంగా కొనసాగుతున్నది. జీ20 అధ్యక్ష దేశంగా భారత్ అమెరికాతో వ్యాపారం చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో భారతదేశం బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ సమూహాల్లో రష్యా, చైనాతో కలిసి ఉంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్​కి ఇండియా ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నది. దీని సదస్సు 2023 జులై 4న న్యూఢిల్లీలో జరగనుంది. ఇన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడటానికి భారతదేశానికి తోడ్పడేది అలీనోద్యమ విధానం మాత్రమే.

పాక్​ - ఇండియా విషయంలోనూ..

1948లో జమ్మూ కాశ్మీర్‌‌‌‌పై పాకిస్తాన్ దాడి తర్వాత భారత ఉపఖండంలో యునైటెడ్ స్టేట్స్ పోషించిన పాత్ర ఇలాంటిదే. పండిట్ జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ 1948 జనవరి 1న జమ్మూ కాశ్మీర్‌‌‌‌పై పాక్​దాడిని ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకువెళ్లారు. భారత్‌‌‌‌పై పాక్‌‌‌‌ దురాక్రమణకు స్వస్తి చెప్పడం సహా యూఎన్​ తొలి తీర్మానాలన్నీ భారత్‌‌‌‌కు అనుకూలంగానే ఉన్నాయి. అయితే ప్రచ్ఛన్నయుద్ధం వచ్చిన తరువాత యునైటెడ్ స్టేట్స్, యూకే భారతదేశానికి వ్యతిరేకంగా పాక్​ను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి వ్యతిరేకంగా ఓటు వేయడం ప్రారంభించిన వెంటనే, కాశ్మీర్ సమస్యపై వారి వైఖరి మారిపోయింది. భారత్‌‌‌‌–-పాక్​ యుద్ధం తర్వాత, ఇందిరాగాంధీ కాశ్మీర్‌‌‌‌ సమస్యను ఐక్యరాజ్యసమితి నుంచి తప్పించి, భారత్‌‌‌‌ – -పాక్ మధ్య ద్వైపాక్షిక విధానంలోకి తీసుకొచ్చారు. 1972 జులై 2న అప్పటి పాక్​ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఇందిరా గాంధీ మధ్య జరిగిన సిమ్లా ఒప్పందం ద్వారా అది సాధ్యపడింది. సిమ్లా ఒప్పందం ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌‌‌‌తో సహా తమ అపరిష్కృత సమస్యలన్నింటినీ ద్వైపాక్షిక చర్చల ద్వారా శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని ఇండియా, పాక్ ​రెండూ అంగీకరించాయి. ఇందిరాగాంధీ హయాంలో అమెరికా 

కుతంత్రాలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొన్నది. నేటి ఉక్రెయిన్ యుద్ధంలో లాగానే యునైటెడ్ స్టేట్స్ సరఫరా చేసిన పెద్ద ఎత్తున ఆధునిక విమానాలు, ఆయుధాలన్నింటినీ భారతదేశానికి వ్యతిరేకంగా, 1965 ,1971లలో జరిగిన యుద్ధాల్లో పాకిస్తాన్ ఉపయోగించింది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇండియా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌‌‌‌కు మద్దతు ఇవ్వడానికి అమెరికా నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఇబ్బందులు నెలకొన్నాయి. అయినప్పటికీ ఇండియా అమెరికా ఒత్తిడికి లొంగిపోవడానికి నిరాకరించింది. నాన్-అలైన్‌‌‌‌మెంట్ విధానాన్ని కొనసాగిస్తోంది. యుద్ధానికి రష్యాను నిందించడానికి నిరాకరించిన భారతదేశం, అలాంటి సంక్లిష్ట పరిస్థితిని దూకుడుగా చక్కగా లేబుల్ చేయలేమని గ్రహించింది. ఉక్రెయిన్‌‌‌‌కు యునైటెడ్ స్టేట్స్ స్పాన్సర్ చేస్తున్నప్పుడు, రష్యా దాని సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడం తప్ప వేరే మార్గం లేదు.

చర్చలతోనే పరిష్కారమంటున్న భారత్

ఒకప్పుడు పాక్​కు ఆయుధ సంపత్తి ఇచ్చి భారత్​తో పోరాడేందుకు తోడ్పడి.. అమెరికా ఇండియాకు వ్యతిరేకంగా వ్యూహం అమలు చేసింది. ఇన్ని చేసిన అగ్రరాజ్యం భారతదేశంతో సహజ సహకారం గురించి మాట్లాడుతుంది. ఇక ఉక్రెయిన్​రష్యా యుద్ధం విషయానికొస్తే.. చర్చలు, దౌత్యం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి భారతదేశం పరిష్కారం కోరుతున్నది. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లనూ భారత్‌‌‌‌ భారీగా పెంచింది. ఉక్రెయిన్ మొదటి డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ ఝపరోవా నాలుగు రోజుల పర్యటన కోసం ఇటీవల భారత్‌‌‌‌లో పర్యటించారు. నిరుడు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ మంత్రి ఈ తరహా పర్యటన చేయడం ఇదే తొలిసారి. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, జాతీయ భద్రతా సలహాదారు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శితో ఎమిన్ ఝపరోవా చర్చలు జరిపారు. ఉక్రెయిన్​ రష్యా యుద్ధం పూర్తిగా ఎప్పుడు ముగుస్తుందో, అమెరికా జోక్యం ఎప్పుడు తగ్గుతుందో వేచి చూడాలి.

అమెరికా ఆయుధాల సరఫరా

పూర్వపు సోవియట్ యూనియన్‌‌‌‌లో భాగమైన ఉక్రెయిన్ ఇప్పటికీ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో రష్యన్ మాట్లాడే ప్రాంతాలను కలిగి ఉంది. ఇక్కడి సంస్కృతి కూడా అలాగే ఉంటుంది. ప్రచ్ఛన్నయుద్ధం ముగింపు, సోవియట్ యూనియన్ పతనం తర్వాత 1991లో ఉక్రెయిన్ స్వాతంత్ర్యం పొందింది.  ఉక్రెయిన్ నాటో, రష్యా మధ్య బఫర్-స్టేట్​గా ఉన్నది. అంతకు ముందు ఉన్న హామీని ఉల్లంఘిస్తూ, ఉక్రెయిన్‌‌‌‌ను నాటో సభ్యదేశంగా చేర్చడానికి యునైటెడ్ స్టేట్స్ ఎత్తుగడలు ప్రారంభించింది.  ఈ చర్యే రష్యాతో యుద్ధానికి దారితీసేలా చేసింది. యుద్ధం తక్కువ సమయంలో ముగిసేదే. కానీ, యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్ ద్వారా రష్యాతో ప్రాక్సీ వార్‌‌‌‌తో పోరాడుతోంది. రష్యాతో పోరాడేందుకు యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్‌‌‌‌కు మారణాయుధాలు, ఎయిర్​క్రాఫ్ట్స్ అందజేస్తున్నది. దానికి పోయేదేమీ లేదు  కాబట్టి ఈ ప్రాక్సీ వార్‌‌‌‌లో యునైటెడ్ స్టేట్స్ అత్యంత క్రూర స్థాయికి వెళ్లేలా యుద్ధాన్ని ఎగదోస్తున్నది. యుద్ధం వల్ల కలిగే విధ్వంసం, నష్టం భరించేది ఉక్రెయినే కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదు కాబట్టి.

- పర్సా వెంకట్,