మాస్కో: రష్యా లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిలోవ్ హత్యకు గురయ్యారు. మంగళవారం మాస్కోలో ఆయన అపార్ట్ మెంట్ బయట ఓ ఎలక్ట్రిక్ బైక్‌లో ఉంచిన బాంబు పేలడంతో కిరిలోవ్ తో పాటు ఆయన సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. బాంబు ధాటికి అపార్ట్ మెంట్ కిటికీలు పగిలిపోయాయి. గోడలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. తమపై యుద్ధంలో నిషేధిత రసాయన ఆయుధాలు ప్రయోగించేందుకు కిరిలోవ్ రష్యా మిలిటరీకి ఆదేశాలు జారీచేశారని ఉక్రెయిన్ ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఆయన హత్యకు గురయ్యారు.
సోమవారమే ఆయనపై ఉక్రెయిన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్న కిరిలోవ్.. రష్యా మిలిటరీకి చెందిన న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ ఫోర్సెస్ కు కూడా చీఫ్‌గా ఉన్నారు. ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో యూకే, కెనడాతో పాటు పలు దేశాలు కూడా ఆయనపై ఆంక్షలు విధించాయి. కాగా.. తామే బాంబు దాడి చేసి కిరిలోవ్ను చంపేశామని ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ పేర్కొంది. రిమోట్ ద్వారా బాంబును ఆపరేట్ చేసి పేల్చేశామని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీక్రెట్ సర్వీస్ అధికారి చెప్పారు.
కిరిలోవ్ తమపై యుద్ధ నేరాలకు పాల్పడ్డారని, మొదటి నుంచీ ఆయనను లక్ష్యంగా చేసుకున్నామని ఆ అధికారి పేర్కొన్నారు. యుద్ధ రంగంలో రష్యా రసాయన ఆయుధాలు ఉపయోగించిన సందర్భాలను 4,800 సార్లు రికార్డు చేశామని చెప్పారు. ఉక్రెయిన్ బలగాలపై క్లోరోపిక్రిన్ రసాయన ప్రయోగం జరిగిందని, దానికి సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని అమెరికా కూడా పేర్కొంది. అయితే.. ఉక్రెయిన్ పై యుద్ధంలో తాము ఎలాంటి రసాయన ఆయుధాలు ప్రయోగించలేదని రష్యా తెలిపింది. ఉక్రెయినే రసాయన ఆయుధాలు ప్రయోగించిందని ఆరోపించింది.