ఉక్రెయిన్​పై డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

కీవ్:  రష్యా  డ్రోన్లతో మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. శనివారం రాత్రి కీవ్, ఖర్కీవ్ నగరాలపై  దాడులు చేసింది.  ఖర్కీవ్ పై జరిగిన దాడిలో 28 మంది గాయపడ్డారు. సెంట్రల్ హోటల్, అపార్ట్ మెంట్ బిల్డింగ్స్, దుకాణాలు, పరిపాలనా భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కీవ్ నగరంలోని ఇన్ ఫ్రాస్టక్చర్ భవనంలో మంటలు చెలరేగాయి. రష్యన్ దళాలు 49 డ్రోన్లను ప్రయోగించగా, 21 డ్రోన్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. రష్యాలోని సరిహద్దు నగరమైన బెల్గోరోడ్‌పై శనివారం ఉక్రెయిన్‌ బలగాలు చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ జరిపిన షెల్లింగ్ లో ముగ్గురు చిన్నారులు సహా 24 మంది మృతి చెందారని రీజినల్ గవర్నర్‌ వ్యాకెస్లావ్‌ గ్లాడ్‌కోవ్‌ తెలిపారు. మరో 108 మంది గాయపడ్డారని చెప్పారు.  ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన తర్వాత రష్యన్ గడ్డపై చోటు చేసుకున్న ఘోరమైన  దాడి ఇదేనని పేర్కొన్నారు.