
గతవారం వైట్ హౌజ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో జెలెన్ స్కీపై ట్రంప్ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. అమెరికా సైనిక సహకారం, నిఘా సమాచారం నిలిపివేయడం వంటి ఆంక్షలు విధించారు. ఈ సంఘటన తర్వాతో మరోసారి అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధులు శాంతి చర్చలకోసం మంగళశారం (మార్చి11) సౌదీలోని జెడ్డాలో సమావేశమయ్యారు. దాదాపు రోజంతా జరిగిన ఆ సమావేశంలో యుద్ధం ఆపేందుకు పలు కీలక చర్యలు జరిగినట్లు తెలుస్తోంది.
వైట్హౌజ్ సమావేశం తర్వాత..యూఎస్, ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం సౌదీ అరేబియాలోని జెడ్డాలో మరోసారి సమావేశమయ్యారు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం ఆపాలనే లక్ష్యంతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉక్రెయిన్ పై వైమానిక, సముద్ర దాడులను వెంటనేనిలిపివేయాలని,ఆ తర్వాత పూర్తి యుద్దం నిలిపివేసే ముందు ఉక్రెయిన్ భద్రతపై హామి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. తక్షణమే పూర్తి కాల్పుల విరమణ కోసం అమెరికా ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో లేని రష్యా..యుద్దం ఆపడానికి ముందుకు కొన్ని షరతుల అమలుకు సంకేతాలు ఇచ్చింది.
అయితే శాంతి చర్యలు విషయంలో ట్రంప్ రాయబారి స్టీవ్ విట్ కాఫ్ ఈవారంలో మాస్కోకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఓ వైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు రష్యా, ఉక్రెయిన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుపడ్డాయి. రష్యాలోని 10 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 343 డ్రోన్లతో దాడులు చేసింది ఉక్రెయిన్. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ముగ్గురు పిల్లలు సహా 18 మంది గాయపడ్డారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్‌పై 126 డ్రోన్లు ,బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. ఉక్రెయిన్ నివాస ప్రాంతాలపై మాస్కో నిరంతరాయంగా దాడులు చేస్తోందని తెలిపింది.
యుద్దం ఆపేందుకు అమెరికా సహకరించాలని ఇందుకోసం ఉక్రెయిన్‌లోని అరుదైన భూమి ఖనిజాలను ఇవ్వడానికి అమెరికాతో ఒప్పందంపై సంతకం చేయడానికి కైవ్ సిద్ధంగా ఉక్రెయిన్ సీనియర్ అధికారులు తెలిపారు - ట్రంప్ ఈ ఒప్పందాన్ని పొందాలని ఆసక్తిగా ఉన్న విషయం తెలిసిందే.