కీవ్: రష్యా మిసైళ్లతో విరుచుకుపడడంతో తమ దేశంలో 10 మంది మృతిచెందారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని.. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున రష్యా దాదాపు వందకు పైగా మిసైళ్లను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేసింది. రెండు దేశాల మధ్య 22 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో రష్యా చేసిన అతిపెద్ద దాడి ఇదే అని జెలెన్స్కీ అన్నారు.
గత బుధవారం రష్యా ఆక్రమిత క్రిమియా పోర్ట్ ఫియోడోసియాలో రష్యా యుద్ధనౌక నోవో చెరకాస్క్పై ఉక్రెయిన్ వార్ఫైట్ల్స్ బాంబుదాడి చేశాయి. ఈ దాడిలో నౌకపై భారీగా మంటలు ఎగసిపడిన వీడియోలు, ఫొటోలు మీడియాలో వచ్చాయి. అయితే ఆ యుద్ధనౌక పూర్తిగా ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ సైనికాధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రష్యా ఈ ప్రతీకార దాడులకు పాల్పడినట్లు తెలుస్తున్నది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ఒడెస్సా, ఖార్కీవ్, దినిప్రో, ఎల్వివ్ సిటీలు, దేశంలోని పలు కీలక ప్రాంతాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో పలు హాస్పిటళ్లు, అపార్టుమెంట్లు, స్కూళ్లు, నివాస ప్రాంతాలు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని, శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని వెల్లడించింది.