మీరు డబ్బులు పెట్టండి.. వారం వారం లాభాలు ఇస్తాం. మీ కింద టీమ్ ను జాయిన్ చేయండి. వారికి వచ్చే లాభాలలో మీకు కమిషన్ ఇస్తాం. ఎంత మంది మీ కింద ఉంటే మీకు అంత లాభాలను ఇస్తాం.. ఇలాంటి స్కీమ్ గురించి వినే ఉంటారు కదా. ఈ మద్య ఈ స్కీమ్ లు ఎక్కువయిపోయాయి. వీటినే ‘పొంజి స్కీమ్’ లు అని అంటారు. స్కీం బాగుందని అందరూ ఇన్వెస్ట్ చేస్తారు. కొన్నాళ్లు చెప్పినట్లుగానే లాభాలు ఇస్తారు. బాగుందని లాభం వచ్చిన వాళ్లు మరికొందరిని జాయిన్ చేస్తారు. కొన్నాళ్ల తర్వాత నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా పెట్టే బేడా సర్దుకొని ఉడాయిస్తారు. స్కీమ్ కాస్త స్కామ్ గా మిగులుతుంది.
స్కీమ్ వెనుక ఉక్రెయిన్ మాస్టర్ మైండ్స్:
సేమ్ ఇలాంటి స్కామ్ ఒకటి ఆమధ్య మహారాష్ట్రలో జరిగింది. టొరెస్ జ్యువెలరీ బ్రాండ్ పేరున జరిగిన స్కామ్ లో ప్రజలు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు పోగొటుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 66 మందిపై 13 కోట్ల 48 లక్షల ఫ్రాడ్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ స్కామ్ సూత్రదారులు ఇద్దరు ఉక్రెయిన్ దేశస్తులని, అందులో ఒకరు మహిళ అని పోలీసులు గుర్తించారు. గురువారం (10 జనవరి 2025) పోలీసులు ఆరు లొకేషన్లలో ఉన్న ఆఫీసులలో రూ.3 కోట్లు సీజ్ చేసి.. స్కామ్ కు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
టొరెస్ జ్వువెలరీ స్కీం2023 ఏప్రిల్ లో లాంఛ్ చేశారు. ముంబై లోని దాదార్, గ్రాంట్ రోడ్, కందివాలి, థానేలోని కళ్యాణ్, నవీ ముంబై లో సాన్పద, పాల్ఘర్ లో మీరా రోడ్ లో టోరెస్ షోరూమ్స్ ఆపరేషన్ ప్రారంభించారు. పెట్టుబడి పెడితే వారానికి 3 నుంచి 7 శాతం వరకు ఇంట్రెస్ట్ చెల్లిస్తామని చెప్పి ఆకర్శించారు. అలా లక్షల మందితో డబ్బులు కట్టించుకొని చివరికి బోర్డు తిప్పేశారు. ఈ స్కామ్ వెనుక ఆర్టెమ్, ఒలెనా స్టోయిన్ అనే ఇద్దరు
ఉక్రెయిన్ కు చెందిన వారిగా గుర్తించారు.
స్కీమ్ లక్కీ డ్రా ద్వారా 14 లక్జరీ కార్లు:
జ్యువెలరీ స్కీం కింద ఒక లక్ష పెట్టుబడి పెడితే.. రూ.10 వేల విలువైన స్టోన్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే చాలా మందికి స్టోన్డ్ జ్యువెలరీ ఇచ్చారు. కానీ 10 వేలుగా చెప్పే ఆ స్టోన్స్ మామూలు బజార్ లో దొరికే రూ.300 విలువ మాత్రమే. కానీ కాస్ట్ లీ స్టోన్స్ గా నమ్మించారు. అదే విధంగా పెట్టుబడి పెడితే వడ్డీతో పాటు లక్కీ డ్రా ద్వారా కానుకలు ఇస్తామని చెప్పి.. అన్నట్లుగానే మొదట్లో లాభాలు షేర్ చేశారు. మధ్య మధ్యలో లక్కీ డ్రా తీస్తూ 14 కార్లు పంచారు. దీంతో స్కీమ్ కు భలే క్రేజ్ వచ్చింది. ఇది చూసి భారీగా ఇన్వెస్ట్ చేశారు. చివరికి స్కామ్ అని తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు.
టెన్త్ ఫెయిల్ అయిన సీఈఓ.. రూ.25 వేల జీతం ఉన్న మేనేజింగ్ డైరెక్టర్:
ఈ కంపెనీ హైరార్కీ చాలా విచిత్రంగా ఫామ్ చేశారు స్టోయిన్, ఆర్టెమ్. టెన్త్ ఫెయిల్ అయిన వ్యక్తిని తౌసిఫ్ రియాజ్ ను సీఈఓగా నియమించారు. సీఈఓ గా ఉండు.. మిగతాది మేము నడిపిస్తామని చెప్పారట. అలాగే.. అదే కంపెనీలో కేవలం రూ.25 వేల జీతం తీసుకుంటున్న ఒక సాధారణ వ్యక్తిని మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారట. వీళ్లతో ప్రమోట్ చేయించి.. మొదట్లో లాభాలు.. లక్కీ డ్రాలు ఇచ్చి.. అందరినీ ఆకర్శించారు.
ALSO READ | ప్రమాదం జరిగిన వెనక్కి తగ్గలే: దుబాయ్ కార్ రేసింగ్‌లో మూడోస్థానంలో అజిత్ టీమ్
అయితే అందులో పనిచేసే కీలక వ్యక్తులు 7 మంది కలసి రాత్రికి రాత్రే దోచుకెళ్లాలనని ప్లాన్ చేశారు. అప్పటి వరకు పోగైన డబ్బులు, జ్యువెలరీ తీసుకొని పరారయ్యారు. తర్వాత దోపిడీ చేసింది సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్లకు చెందిన వ్యక్తులేనని సీసీ టీవీ ద్వారా నిర్ధారించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో అందులో పని చేసే ఉద్యోగులు వాళ్లను గుర్తించారు.
పక్కా పకడ్బందీగా చేసిన ఈ స్కామ్.. ‘‘వాళ్లను అరెస్టైనా చేయండి.. ఏమైనా చేయండి.. మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు’’ అంటూ ప్రభుత్వానికి నివేదిస్తున్నారు బాధితులు. ఇలాంటి పొంజీ స్కీమ్ ల గురించి ఎవరైనా చెబితే కాస్త జాగ్రత్తగా ఉండండి. లక్ష రూపాయలకు రోజుకు 5 వేలు, పదివేలు ఇస్తాం.. మీరు పెట్టిన ఎమౌంట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తారని చెప్తుంటారు. మొదట్లో కొంత ఇచ్చినట్లు చేసి తర్వాత చెక్కే్స్తారు. ఆ తర్వాత ఎంత బాధపడినా లాభం ఉండదు.