మనం చేసే ఒక చిన్న పని.. అవతలి వాళ్ల పెదాలపై చిరునవ్వు తెప్పిస్తే... మనసుకు బాగుంటుంది కదా! అచ్చం అలాంటి ఫీలింగ్‌ని సొంతం చేసుకునేందుకు వొలోడిమైర్ అనే అతను స్ట్రీట్ ఫొటోగ్రఫీ చేస్తున్నాడు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు పనులు చేసుకుంటున్న మనుషుల ఫొటోలు తీస్తున్నాడు. అంతేకాదు.. వాటిని ప్రింట్ తీసి వాళ్లకే ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంటాడు.
సంతోషం, ఆనందం, దుఃఖం, బాధ, కష్టం, సుఖం... ఇలా అన్ని రకాల భావోద్వేగాలను ఒడిసి పట్టి వాటిని అప్పటికప్పుడు మార్చేస్తూ బతకడమే వొలోడిమైర్ క్రిచోవ్స్కీ పని. అతనిది ఉక్రెయిన్. చెక్ రిపబ్లిక్‌లో ఉంటున్న వొలోడిమైర్ ప్రతిరోజూ ఆనందంగా ఉండాలి. ఆ ఆనందాన్ని నలుగురికి పంచాలి అనుకుంటాడు. అందుకోసం అతను ఎంచుకున్న మార్గం ఫొటోగ్రఫీ. రోజూ కెమెరా పట్టుకుని వీధుల్లోకి వెళ్తాడు. ఆ రోడ్ల వెంట నడిచే వాళ్ల ఫొటోలు తీస్తాడు. పర్ఫెక్ట్ షాట్‌ను క్యాప్చర్ చేశాక ఆ ఫొటోని ఇన్‌స్టంట్ మినీ ప్రింటర్‌తో ప్రింట్ చేస్తాడు.
ఫొటోలోని వ్యక్తులకు ఆ ఫొటోని స్పెషల్ గిఫ్ట్‌గా ఇస్తాడు. అప్పుడు వాళ్ల ముఖాల్లో ఆనందంతో పాటు కొంచెం ఆశ్చర్యం కూడా కనిపిస్తుంది. బాధలో ఉన్నవాళ్లు దాన్ని చూడగానే చిరునవ్వు నవ్వుతారు. సంతోషంగా ఉన్నవాళ్ల ఆనందం ఇంకింత రెట్టింపు అవుతుంది. ఫొటో తీయడం దగ్గర్నించి తీసిన ఫొటోను వాళ్లకు ఇచ్చినప్పటి ఎక్స్ప్రెషన్స్ వరకు అంతా వీడియో తీసి యూట్యూబ్‌లో పెడతాడు. ఇతని ఫొటోగ్రఫీ జర్నీ గురించి అతని మాటల్లోనే..
‘‘స్ట్రీట్ ఫొటోగ్రఫీ నాకు అసలైన ప్రపంచాన్ని చూపిస్తోంది. ఇది ఒక అద్భుతమైన లివింగ్ స్టయిల్. డైలీ రొటీన్లో భాగంగా రకరకాల ప్రజలను చూస్తున్నా. వాళ్ల జీవితాల్లో ఉండే ఎన్నో వాస్తవమైన క్షణాలను క్యాప్చర్ చేస్తున్నా. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడానికి, డాక్యుమెంట్ చేయడానికి, నిష్కపటమైన వ్యక్తులను కలవడానికి ఇది నాకు దొరికిన ఒక చక్కటి అవకాశం.
...ఇలా మొదలైంది
జీవితంలోని కొన్ని ముఖ్యమైన క్షణాలను దాచుకోవాలి, పంచుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడే నా జీవితంలోకి ఫొటోగ్రఫీ వచ్చింది. నేను అనుకున్నట్టే అందరూ అనుకుంటారు కదా! అందుకే వాళ్ల ఫన్నీ, ఎమోషనల్ మూమెంట్స్‌ని ఫొటోలో క్యాప్చర్ చేసి వాళ్లకే గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించుకున్నా. మొదట్లో నా ఫోన్‌లోనే ఫొటోలు తీసేవాడ్ని. మొదట్లో కేవలం ఎదుటి వ్యక్తుల జీవితాల్లోని స్పెషల్ మూమెంట్స్‌ని ఫొటో తీయాలి అనుకున్నా. కానీ.. నాకు కూడా అలా ఫొటోలు తీసే క్షణాలు స్పెషల్‌గానే అనిపించాయి. ఇప్పుడు అలాంటి ప్రతి క్షణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నా.
నేను తీసిన ఫొటోలు చాలామందికి తీపి గుర్తులుగా ఉండిపోతాయి. ఆ ఫొటో చూడగానే వాళ్లిచ్చే రియాక్షన్స్ నాకు ఆనందాన్ని ఇస్తాయి. వాళ్ల కళ్ళలో ఆశ్చర్యం, ఆనందం కనిపిస్తుంది. ఆ ఆనందమే నాకు స్ఫూర్తి. మొదట్లో తీసిన ఫొటో మాత్రమే చూపించే వాడిని. వాళ్లకు మరింత సంతోషాన్ని అందించాలనే ఉద్దేశంతో ఫొటోలు ప్రింట్ తీసి ఇవ్వడం మొదలుపెట్టా” అన్నాడు వొలోడిమైర్.
యూట్యూబ్‌లోకి...
వొలోడిమైర్ 2023 జూన్ 10న యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తను తీసిన ఫొటోలను ప్రింట్ తీసి ఇస్తుండడంతో యూట్యూబ్ ఛానెల్‌కు ‘ప్రింటోగ్రాఫర్1’ అని పేరు పెట్టాడు. ఛానెల్ పెట్టిన అదే రోజు మొదటి వీడియో అప్లోడ్ చేశాడు. వొలోడిమైర్ ఫొటోగ్రఫీ కాన్సెప్ట్ బాగా నచ్చడంతో ఛానెల్‌ను తక్కువ టైంలోనే చాలామంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఛానెల్‌కు 4.67 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు.
ఛానెల్లో వీడియోలను చెక్ రిపబ్లిక్, ఉక్రెయిన్ నుంచే కాకుండా చాలా దేశాల వాళ్లు చూస్తున్నారు. అంతెందుకు ఇండియాలో కూడా ప్రింటోగ్రాఫర్1 ఛానెల్‌కు సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 431 వీడియోలు అప్లోడ్ చేశాడు. అందులో ఒక్కటి మాత్రమే పెద్ద వీడియో. మిగతావన్నీ షార్ట్ వీడియోలే.
ఒక్కో వీడియోలో ఒక్కొక్కరి రియాక్షన్స్ క్యాప్చర్ చేస్తుంటాడు. వాటిలో ఒక పాప నీళ్లలో తడుస్తూ ఆడుతుంటే తీసిన ఫొటో, చేసిన వీడియోకు 415 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇదే ఇతని ఛానెల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో. మరో వీడియోలో లేడీ పోలీస్‌ని ఫొటో తీశాడు. దానికి 165 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. పది మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు బోలెడు ఉన్నాయి. ఇతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా1.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.