అమెరికాకు రుణపడి ఉంటం..ఆ దేశంతో డీల్​కు సిద్ధంగా ఉన్నం : జెలెన్​స్కీ

అమెరికాకు రుణపడి ఉంటం..ఆ దేశంతో డీల్​కు సిద్ధంగా ఉన్నం  : జెలెన్​స్కీ
  • ఆ దేశంతో డీల్​కు సిద్ధంగా ఉన్నం
  • మాకు భద్రతా హామీలు ముఖ్యం
  •  జెలెన్​స్కీ వీడియో సందేశం

కీవ్: అమెరికాతో సంబంధాలపై ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్​స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి అమెరికా సాయం మరిచిపోలేనిదని, ఆ దేశానికి రుణపడి ఉంటామన్నారు. ఖనిజాల ఒప్పందంపై  ఏకాభిప్రాయం కుదిరితే  సంతకం చేసేందుకు రెడీ అని చెప్పారు.  ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌‌  తో భేటీ వివాదంగా మారిన నేపథ్యంలో తాజాగా జెలెన్​స్కీ వీడియో సందేశం రిలీజ్​ చేశారు. ‘‘మేం అమెరికా ప్రాముఖ్యతను గుర్తించాం. ఆ దేశానికి  కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాకిప్పుడు యుద్ధం ముఖ్యం కాదు.. శాంతి కావాలి.. అందుకే వాస్తవమైన భద్రతా హామీలు ముఖ్యమని మేం చెబుతున్నాం’’ అని జెలెన్‌‌స్కీ పేర్కొన్నారు. 

యూరోప్​ నుంచి పూర్తి మద్దతు

శాంతి స్థాపనపై తామంతా ఐక్యంగా ఉన్నామని జెలెన్​స్కీ తెలిపారు. యూరోప్​ నుంచి తమకు పూర్తి మద్దతు ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం తమకు వాస్తవమైన భద్రతా హామీలు అవసరమని తెలిపారు. ఈ విషయంపై యూరోపియన్​ యూనియన్​తోపాటు, యూకే, టర్కీ సపోర్ట్​గా నిలుస్తున్నాయని చెప్పారు.  అమెరికాతో సత్సంబంధాలను కాపాడుకుంటామని, సానుకూలమైన చర్చల కోసం ట్రంప్‌‌ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని స్పష్టం చేశారు. కాగా, ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​గా రాజీనామా చేయాలని సూచించిన యూఎస్​ సెనేటర్​ లిండ్సే గ్రాహంపై జెలెన్​స్కీ మండిపడ్డారు. లిండ్సే గ్రాహంకు తాను ఉక్రెయిన్​ పౌరసత్వం ఇస్తానని, ఆ తర్వాత దేశానికి ఎవరు అధ్యక్షుడిగా ఉండాలో లిండ్సే సూచించాలని చురకలు అంటించారు.