- ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ
న్యూఢిల్లీ: భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తల్చుకుంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలుగుతారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఆర్థికంగా, జనాభాపరంగా పెద్ద దేశానికి మోదీ ప్రధాని అని గుర్తుచేశారు. ఎంతో కెపాసిటీ ఉన్న ఇలాంటి దేశం ఊరికే మాటలు చెప్పదని, యుద్ధం ముగిస్తుందన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ మాట్లాడారు.
కొద్దిరోజులకింద జరిగిన బ్రిక్స్ సమావేశం గురించి ఆయన ప్రస్తావించారు. ఆ సమావేశంలో పాల్గొన్న సభ్యదేశాలన్నీ రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు అనుకూలంగా మాట్లాడేవారేనని కామెంట్ చేశారు. మోదీ మాత్రం ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి ప్రస్తావించారని, శాంతికోసం కృషి చేయాలని సూచించారని గుర్తుచేశారు. అయితే, ఎంతోమంది లీడర్లు యుద్ధం ముగింపు గురించి మాట్లాడటం సాధారణమైపోయిందన్నారు.
మాటలు చెప్తే యుద్ధం ఆగదు
నిజంగా ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటే ఎన్నో చేయొచ్చని జెలెన్స్కీ అన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను అడ్డుకోవడం ద్వారా భారత్ లాంటి దేశాలు కలిసి యుద్ధాన్ని సులభంగా ఆపొచ్చన్నారు. ‘‘రష్యా ఆర్థికవ్యవస్థను అడ్డుకోవడం, ఇంధన వనరులను కట్టడి చేయడం, రష్యన్ పారిశ్రామిక సముదాయాలను నిరోధించడం వంటి పనులు చేసి ఆ దేశ యుద్ధ సామర్థ్యాన్ని తగ్గించవచ్చు. జీ 20 దేశాలు తల్చుకుంటే పుతిన్‌ను ఈజీగా కట్టడి చేయొచ్చు. అంతేగానీ, ఆయనను మెప్పించే మాటలు చెప్పుడు సరిపోదు. మేం శాంతిని కోరుకుంటున్నాం అని చెప్పనవసరం లేదు. దానికి బదులు ఏదోఒక చర్య తీస్కోవడం బెటర్”అని జెలెన్స్కీ అన్నారు.
మా పిల్లలనైనా తిరిగి రప్పించండి
వేలాది మంది ఉక్రెయిన్ పిల్లలు రష్యా అధీనంలో ఉన్నారని, కనీసం ఆ పిల్లలను తిరిగి తీసుకువచ్చేందుకైనా కృషి చేయాలని జెలెన్స్కీ అన్నారు. అందులో 1,000 మంది పిల్లలనైనా ప్రధాని మోదీ తమ దేశానికి తిరిగి తీసుకురావాలన్నారు.“మీరు పిల్లలను తీసుకొచ్చేందుకు సంకీర్ణంలో చేరొచ్చు. పుతిన్‌కు ఫోన్ చేసి నిలదీయొచ్చు. పిల్లలను బలవంతంగా ఎలా ఆధీనంలో ఉంచుకుంటారని ప్రశ్నించొచ్చు”అని జెలెన్స్కీ అన్నారు. మోదీ తప్పకుండా ఆ పని చేయగలరని, ఆయన నిజంగా గొప్ప ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉన్నారని చెప్పారు. ఉక్రెయిన్‌కు ఇంత మంది పిల్లలను తిరిగి రప్పిస్తా అని తనకు చెప్పగలిగే కెపాసిటీ మోదీకి ఉందన్నారు. ‘అలాంటి ప్రధాని కనీసం వెయ్యి మంది పిల్లలను తీసుకురానీ”అని జెలెన్స్కీ అన్నారు. మోదీ మాదిరిగానే ఇంకొంతమంది లీడర్లు కలిసి ఎంతోమంది పిల్లలను తిరిగి ఉక్రెయిన్‌కు తిరిగి తీసుకురాగలరని, ఇప్పుడదే పని చేయాల్సి ఉందని అన్నారు.