
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఫోన్ చేశారు. దాదాపు గంట పాటు ఇరు దేశాధినేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌తో ట్రంప్ జరిపిన చర్చల గురించి ఈ సందర్భంగా జెలెన్ స్కీ ఆరా తీశారు. కాల్పుల విరమణకు రష్యా అంగీకరించిందా..? యుద్ధం ఆపడంపై పుతిన్ వైఖరి ఏంటి..? రష్యా డిమాండ్లు ఏంటి..? అన్న తదితర విషయాల గురించి ట్రంప్‌ను అడిగి తెలుసుకున్నారు జెలెన్ స్కీ.
కాగా, దాదాపు మూడేళ్లుగా జరుగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో అమెరికా ప్రతినిధులు మొదటగా చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో 30 రోజుల పాటు కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది. అనంతరం ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌తో చర్చలు మొదలు పెట్టారు.
ALSO READ | గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. స్పందించిన భారత్
ఈ మేరకు మంగళవారం (మార్చి 18) పుతిన్‌తో ట్రంప్ మాట్లాడారు. శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరించి ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ కోరారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడి ముందు ఒక షరతు పెట్టారు పుతిన్. కీవ్, మాస్కో మధ్య వివాదం మరింత పెరగకుండా నిరోధించడానికి ఉక్రెయిన్‌కు విదేశీ సైనిక సహాయం అందించడం, నిఘా సేవలను పూర్తిగా నిలిపివేయాలని పుతిన్ కోరారు.
దీనికి స్పందించిన ట్రంప్.. ఇరు దేశాల్లో ఇంధనం, మౌలిక సదుపాయాలపై దాడులకు రష్యా, ఉక్రెయిన్ పరస్పరం దూరంగా ఉండాలని ప్రతిపాదించగా దీనికి సానుకూలంగా స్పందించారు పుతిన్. ఈ నేపథ్యంలోనే ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు జరిగిన మరుసటి రోజే జెలెన్ స్కీ అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేశారు. ఇద్దరి మధ్య జరిగిన చర్చలు గురించి ఆరా తీశారు. ట్రంప్, పుతిన్ మధ్య చర్యలు సానుకూలంగా జరగడంతో త్వరలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.