- కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదు
- బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్
- వలస వ్యతిరేక అల్లర్లపై అత్యవసర సమావేశం
లండన్: వలసలను వ్యతిరేకిస్తూ బ్రిటన్ లో ఆందోళనకారులు హింసకు పాల్పడడంపై ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ సీరియస్ అయ్యారు. నిరసనకారులు హద్దు మీరారని, కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. గత వారం దేశంలోని వివిధ నగరాల్లో చోటుచేసుకున్న వలస వ్యతిరేక అల్లరపై సోమవారం లండన్ లో సీనియర్ మంత్రులతో ప్రధాని అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత వారం చోటుచేసుకున్న హింసను ఖండిస్తున్నానని అన్నారు. ‘‘హింసకు పాల్పడిన వారిని వదలం. వారిని చట్టం కఠినంగా శిక్షిస్తుంది. నిరసనకారుల చర్యలు సిగ్గుచేటు. దేశ ప్రజలంతా అలాంటి హింసను ఖండించాలి. బ్రిటన్ లో ప్రశాంతంగా నివసించే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది. ఆందోళనకారులు ముస్లిం కమ్యూనిటీ వారిని లక్ష్యంగా చేసుకుని మసీదులపై దాడి చేశారు. వారు చేసింది చాలా ఘోరమైన తప్పిదం” అని కీర్ వ్యాఖ్యానించారు.
హింస నేపథ్యంలో దేశంలోని అన్ని మసీదులతో పాటు ఇతర ప్రార్థనా మందిరాలకూ రక్షణ కల్పిస్తామని ఆయన తెలిపారు. శాంతిభద్రతలను నెలకొల్పడంలో, హింసపై దర్యాప్తులో పోలీసులకు పూర్తి అధికారాలు కేటాయించామని చెప్పారు. కాగా.. రోథర్ హామ్, మిడిల్స్ బ్రా, బోల్ట్ తో పాటు ఇతర నగరాల్లో హింసకు పాల్పడిన వారిలో వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటళ్లు, మసీదులను లక్ష్యంగా చేసుకొని ఆందోళనకారులు దాడులు చేశారు. అయితే, అల్లర్లకు ముందు సౌత్ పోర్ట్ పట్టణంలో ముగ్గురు బాలికలను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపేశారు. దేశంలోకి చొరబడిన వారే ఈ హత్యలకు పాల్పడ్డారని సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో దేశవ్యాప్తంగా వలస వ్యతిరేక ఆందోళనలు ప్రారంభమయ్యాయి.