డీల్ విలువ రూ.851 కోట్లు
న్యూఢిల్లీ : సిమెంట్ పరిశ్రమలో పోటీ తీవ్రతరం అవుతోంది. అదానీతో పోటీ పడేందుకు అల్ట్రాటెక్ విస్తరణ బాట పట్టింది. స్టార్ సిమెంట్‌లో మైనారిటీ వాటాను కొంటున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.851 కోట్లని తెలిపింది. ఇందుకోసం ప్రమోటర్ గ్రూపునకు చెందిన రాజేంద్ర చమారియా, ఆయన కుటుంబం నుంచి 3.70 కోట్ల ఈక్విటీ షేర్లను కొంటోంది. ఒక్కో షేరుకు రూ.235లోపు చెల్లిస్తుంది. చమారియా కుటుంబం మాత్రమే వాటాలు అమ్ముతోందని, మిగతా ప్రమోటర్లు అమ్మడం లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఈ విషయమై మాట్లాడేందుకు రాజేంద్ర చమారియా ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఈయన కుటుంబానికి అల్ట్రాటెక్‌లో 11.25 శాతం వరకు వాటాలు ఉన్నాయి. ఆదిత్య బిర్లా గ్రూపు ఇండియా సిమెంట్స్‌లో నాలుగు రోజుల క్రితమే వాటాను దక్కించుకొని, సబ్సిడరీగా మార్చుకుంది. మనదేశంలోనే రెండో అతిపెద్ద సిమెంటు కంపెనీ అంబుజా సిమెంట్ (అదానీ గ్రూపు) నుంచి బిర్లా గ్రూపు తీవ్రపోటీని ఎదుర్కొంటోంది.
దీనిని తట్టుకోవడానికి ఇతర సిమెంట్ కంపెనీల్లో వాటాలను కొంటున్నది. కెపాసిటీని మరింత పెంచుతోంది. అదానీ గ్రూపు కూడా విస్తరణ కోసం చిన్న కంపెనీలను దక్కించుకుంటోంది. ఈశాన్య రాష్ట్రాల మార్కెట్లలో ఎక్కువగా కనిపించే స్టార్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 7.7 ఎంటీపీఏ (మిలియన్ టన్స్ పర్ ఆనమ్) వరకు ఉంది.
ఈశాన్యంలో నం.1 బ్రాండ్
స్టార్ సిమెంట్స్ ఈశాన్య భారతంలో అతిపెద్ద సిమెంట్బ్రాండ్. ఇది పశ్చిమ బెంగాల్, బిహార్లలో వ్యాపారాన్ని విస్తరిస్తోంది. విస్తరణలో భాగంగా అస్సాంలోని సిల్చార్‌లో రెండు మిలియన్ టన్నుల కెపాసిటీ ప్లాంటును నిర్మిస్తామని ఇటీవలే ప్రకటించింది. మొత్తం కెపాసిటీని 15 మిలియన్టన్నులకు తీసుకెళ్తామని తెలిపింది. స్టార్ సిమెంట్‌ను 2001 నవంబరులో స్థాపించారు. ప్రమోటర్ భజంకా కుటుంబానికి, ప్రమోటర్స్ గ్రూప్‌కు 66.47 వాటా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో దీనికి రూ.2,910 కోట్ల టర్నోవర్‌పై రూ.295 కోట్ల నికరలాభం వచ్చింది.
మేఘాలయకు చెందిన ఈ కంపెనీకి ఏడు ప్లాంట్లు, నాలుగు వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 2030 నాటికి సిమెంట్ ప్రొడక్షన్ కెపాసిటీని 25 ఎంటీపీఏలకు తీసుకెళ్లాలని టార్గెట్‌గా పెట్టుకుంది. మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని కొనసాగించడానికి ప్రొడక్షన్ కెపాసిటీని 2027 నాటికి 200 ఎంటీపీఏలకు పెంచాలని అల్ట్రాటెక్ సిమెంట్ భావిస్తోంది. ఈ ఏడాది ఇండియా సిమెంట్స్‌ను దక్కించుకోవడమే గాక, కేశోరామ్ సిమెంట్స్కొనుగోలు కోసమూ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
అదానీ సిమెంట్స్, సౌరాష్ట్ర ఆధారిత సంఘీ ఇండస్ట్రీస్‌తో పాటు పెన్నా ఇండస్ట్రీస్ కొనుగోలును పూర్తి చేసింది. ఇటీవలే సీకే బిర్లా గ్రూప్ సంస్థ ఓరియంట్ సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని అనుబంధ సంస్థ ఏసీసీ కూడా ఆసియన్ కాంక్రీట్‌ను దక్కించుకుంది. దీంతో అదానీ సిమెంట్ కెపాసిటీ ఏడాదికి 100 ఎంటీపీఏలకు చేరుకుంది. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం 0.36 శాతం నష్టపోయి రూ.11,419 వద్ద ముగిశాయి.