న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్లకు చెందిన 32.72 శాతం వాటాను అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.3,954 కోట్లు. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో అల్ట్రాటెక్ సిమెంట్ విస్తరించడానికి తాజా డీల్ సాయపడుతుంది. దీంతో పాటు ఇండియా సిమెంట్స్‌లో మరో 26 శాతం వాటాను షేర్ హోల్డర్ల నుంచి కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
ఇందుకోసం రూ. 3,142.35 కోట్లను ఖర్చు చేయనుంది. ఇండియా సిమెంట్స్ ప్రమోటర్లు, అసోసియేట్ల నుంచి షేరుకి రూ.390 చెల్లించి 32.72 శాతం వాటాను కొనుగోలు చేయడానికి బోర్డ్ ఆమోదం తెలిపిందని అల్ట్రాటెక్ సిమెంట్ ఆదివారం ప్రకటించింది. ప్రమోటర్లు శ్రీనివాసన్ ఎన్, చిత్ర శ్రీనివాసన్, రూపా గురునాథ్, ఎస్‌కే అశోఖ్ బాలాజి నుంచి 28.42 శాతం వాటాను, శ్రీ శారద లాజిస్టిక్స్ నుంచి 4.30 శాతం వాటాను దక్కించుకోనుంది.
ఈ డీల్ పూర్తయితే ఇండియా సిమెంట్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్ వాటా 55 శాతానికి పెరుగుతుంది. ఫలితంగా సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఓపెన్ ఆఫర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. షేరుకి రూ.390 చెల్లించి 26 శాతం వాటాను ఓపెన్ ఆఫర్‌లో కొనుగోలు చేయడానికి కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపింది. ఇండియా సిమెంట్స్ షేరు శుక్రవారం రూ.375 దగ్గర ముగియగా, కంపెనీ ఆఫర్ చేస్తున్న షేరు ధర దీని కంటే 4.1 శాతం ఎక్కువ. ఈ ఏడాది జూన్‌లో ఇండియా సిమెంట్స్‌లో 23 శాతం వాటాను అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేసింది. దమాని గ్రూప్ వాటాను దక్కించుకుంది. ]
ఈ డీల్ విలువ రూ.1,900 కోట్లు. ఇండియా సిమెంట్స్ మొత్తం కెపాసిటీ 14.45 మిలియన్ టన్నులు పెర్ యానమ్ (ఎంటీపీఏ). మరోవైపు అల్ట్రాటెక్ సిమెంట్‌తో పోటీ పడుతున్న అదానీ గ్రూప్ కూడా తన సిమెంట్ తయారీ కెపాసిటీని పెంచుకుంటోంది. హైదరాబాద్ కంపెనీ పెన్నా సిమెంట్‌ను రూ.10,422 కోట్లకు కొనుగోలు చేస్తామని కిందటి నెలలో ప్రకటించింది. ఈ అక్విజేషన్‌తో అదానీ గ్రూప్ సిమెంట్ తయారీ కెపాసిటీ 14 ఎంటీపీఏ పెరిగి 93 ఎంటీపీఏకి చేరుతుంది.
154.86 ఎంటీపీఏ కెపాసిటీతో ఇండియాలో అతిపెద్ద సిమెంట్ కంపెనీగా అల్ట్రాటెక్ సిమెంట్ కొనసాగుతోంది. తన కెపాసిటీని 200 ఎంటీపీఏకి పెంచుకోవాలని చూస్తోంది. అంబుజా సిమెంట్, ఏసీసీలను 2022 లో కొనుగోలు చేసి రెండో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థగా అదానీ గ్రూప్ ఎదిగింది. 2027–28 నాటికి తన కెపాసిటీని 140 ఎంటీపీఏకి పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.