- మొత్తం ఆదాయం రూ.18,562 కోట్లు
- షేరుకు రూ.38 చొప్పున డివిడెండ్
న్యూఢిల్లీ: అల్ట్రాటెక్ సిమెంట్‌కు ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో నికర లాభం (కన్సాలిడేటెడ్ ) 36 శాతం తగ్గి రూ.1,666 కోట్లకు చేరుకుంది. కిందటి ఏడాది ఇదే కాలంలో రూ.2,620 కోట్ల లాభం వచ్చింది. 2023 మార్చి తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ. 10 ఫేస్ వాల్యూ గల ఈక్విటీ షేరుకు రూ. 38 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బోర్డు సిఫార్సు చేసింది. ఈ కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.15,767 కోట్ల నుంచి18 శాతం పెరిగి రూ.18,562 కోట్లకు చేరుకుంది. ఈ క్వార్టర్లో ఇబిటా రూ. 3,444 కోట్లుగా ఉంది. ఇది కిందటి సంవత్సరం క్యూ4తో పోలిస్తే 9శాతం పెరిగింది. అమ్మకాల సైజు 31.7 మిలియన్ టన్నులు ఉంది. ఇది వార్షికంగా 14 శాతం, సీక్వెన్షియల్‌గా 22శాతం పెరిగింది.
దేశీయంగా అమ్మకాలు 15 శాతం పెరిగి 30.5 మిలియన్ టన్నులకు చేరాయి. ఆపరేషనల్ ఇబిటా డిసెంబరు క్వార్టర్లో మిలియన్ టన్నులకు రూ. 900 నుంచి రూ. 1,060 కి పెరిగింది. గ్రే సిమెంట్ తయారీ 15శాతం పెరిగి 29.9 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఎగుమతులు మాత్రం 2 శాతం తగ్గి 1.3 మిలియన్ టన్నులకు చేరాయి. వైట్ సిమెంట్ వాల్యూమ్‌లు 0.5 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ఈ మార్చి క్వార్టర్లో సిమెంట్ తయారీ సామర్థ్యం 5.6 ఎంటీపీఏలకు చేరింది. భారతదేశంలో కంపెనీ గ్రే సిమెంట్ సామర్థ్యాన్ని 126.95 ఎంటీపీఏకి తీసుకువెళ్లింది. కంపెనీ రెడీమిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) నెట్‌వర్క్ 100 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించింది. ప్లాంట్ల సంఖ్య 231కి పెరిగింది. అల్ట్రాటెక్ షేర్లు మంగళవారం 0.52శాతం లాభంతో రూ.7,540 వద్ద ముగిశాయి.