‘మందు కాదు.. ఆవు పాలు తాగండి’

‘మందు కాదు.. ఆవు పాలు తాగండి’
  • వైన్​ షాపు ముందు ఆవును కట్టేసి ఉమా భారతి ప్రచారం

నివారీ: ఆరోగ్యాన్ని పాడు చేసే మందును దూరంపెట్టి, రోజూ ఆవు పాలు తాగాలని బీజేపీ సీనియర్ లీడర్, మధ్యప్రదేశ్​మాజీ సీఎం ఉమా భారతి ప్రజలకు పిలుపునిచ్చారు. మద్యపానం అలవాటు ఉన్నోళ్లను ఆ వ్యసనాన్ని మానుకోవాలని హితవు పలికారు. మందుబాబులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు ఏకంగా ఓ వైన్​ షాపు ముందు ఆవును కట్టేశారు. మద్యం కొనడానికి వచ్చేటోళ్లకు ఆవును చూపిస్తూ, తాగాల్సింది ఆవుపాలే తప్ప మందుకాదని సూచించారు.

మధ్యప్రదేశ్ లోని నివారీ జిల్లా ఓర్చా పట్టణంలో ఈ ఘటన జరిగింది. షాపు వద్దకు వెళ్లిన ప్రజలను ఉద్దేశిస్తూ ఉమా భారతి మాట్లాడారు. మద్యం బదులు ఆవుపాలు తాగాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. మద్యం.. ప్రజల ప్రాణాలు తోడేస్తోందని, దానిని ఆదాయ వనరుగా చూడొద్దని ప్రభుత్వానికి సూచించారు. కాగా, రాష్ట్రంలో నెలకొన్న తాగుడు సమస్యకు తాను కూడా కొంతమేర కారణమేనని చెప్పారు. రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం ఆల్కహాల్ రెగ్యులరైజేషన్ చేయాలని కొన్ని నెలలుగా తాను కృషి చేస్తున్నానని తెలిపారు.