Pakistan Cricket: నన్ను తీసుకోలే.. బాబర్ ఓ పనికిమాలిన కెప్టెన్: ఉమర్ అక్మల్

Pakistan Cricket: నన్ను తీసుకోలే.. బాబర్ ఓ పనికిమాలిన కెప్టెన్: ఉమర్ అక్మల్

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌పై ఆ జట్టు మాజీ ఓపెనర్/ కీపర్ ఉమర్ అక్మల్ విమర్శలు గుప్పించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్గనిస్తాన్ చేతిలో, 2024 టీ20 ప్రపంచకప్‪లో అమెరికా చేతిలో ఓటములు సహా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ చేతిలో పరాజయాల వరకూ అన్నింటికీ బాబరే కారణమని ఆరోపించాడు. 

ఆజాం ఎన్నడూ జట్టు ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోలేదని అక్మల్ అన్నాడు.. తన ఇష్టాలకు అనుగుణంగా నడుచుకునే వాడని.. అతడు ఏది చెప్తే, అదే ఫైనల్ అన్నట్లు కోచ్‌లు నడుచుకునేవారని సంచలన విషయాలు బయటపెట్టాడు. దాదాపు నాలుగైదేళ్ల జట్టును నడిపించిన ఆజాం రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించే సాహసం ఎప్పుడు చేయలేదన్నాడు. అగ్రశ్రేణి జట్లయినా.. చిన్న జట్లయితో ఏడాది పొడువునా పదకొండు మంది ముఖాలే కనిపించేవని అన్నాడు. బాబర్ పైకి గంభీరంగా కనిపించినా.. లోలోపల  చాలా భయస్థుడని తెలిపాడు. ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో అక్మల్ ఈ ఆరోపణలు చేశాడు.

కలిసి మరీ ప్రాధేయపడ్డా..

తనను జట్టులోకి తీసుకోకపోవడం పట్ల అక్మల్ నిరాశ వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ, జాతీయ జట్టులో తనను విస్మరించారని పేర్కొన్నాడు. తన ఫామ్ ఆధారంగా తిరిగి జట్టులోకి రావడానికి అవకాశం కోసం తాను వ్యక్తిగతంగా ఆజంను సంప్రదించానని, కానీ ఎన్నడూ అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు.

"చూడు బాబర్‌ నాకు ఒక్క అవకాశం ఇవ్వు. నువ్వు టాప్ ఆర్డర్‌లో బాగా రాణిస్తున్నావు. నేను నీ ఫినిషర్‌గా జట్టులో ఉంటా.. మనం క్రమం తప్పకుండా మ్యాచ్‌లు గెలవగలం. జట్టుకు ఇదీ చాలా బాగుంటుంది అని చెప్పా.. ఆ సమయంలో సరేనన్నాడు. కానీ ఏనాడూ నా విషయాన్ని సెలెక్టర్ల ముందు ప్రస్తావించకపోయాడు.." అని అక్మల్ అన్నాడు.

ఆజాం బంధువైన అక్మల్ 2019లో జట్టుకు దూరమయ్యాడు. అంతటితో అతని కెరీర్ ముగిసిపోయింది. అక్మల్ పాకిస్తాన్ తరపున 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20లు ఆడాడు.