టీ20 వరల్డ్ కప్ లో మ్యాచ్ లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఫోర్లు, సిక్సర్లు చూసి విసుగెత్తిన అభిమానులకు లో స్కోరింగ్ మ్యాచ్ లు మంచి కిక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ ల్లో బౌలర్లు జోరు కొనసాగుతుంది. ఇందులో భాగంగా నిన్న (జూన్ 10) దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మరో థ్రిల్లర్ ను అందించింది.
చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓటమికి అంపైర్ కారణమని తెలుస్తుంది. అంపైర్ చేసిన రెండు తప్పుడు నిర్ణయాలు కారణంగా బంగ్లాదేశ్ గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది. బార్ట్ మన్ వేసిన 17వ ఓవర్ రెండో బంతి మహ్మదుల్లా ప్యాడ్లకు తగిలి ఫైన్ లెగ్ మీదుగా బౌండరీకి వెళ్లింది. ఎల్బీడబ్ల్యూకు అపీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు.
నాటౌట్ అని భావించిన మహ్మదుల్లా రివ్యూకి కోరగా నాటౌట్ అని తేలింది. అయితే బౌండరీ ద్వారా వచ్చిన నాలుగు పరుగులు మాత్రం జత కాలేదు. రూల్స్ ప్రకారం అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ ఇచ్చి, ఆ తర్వాత రివ్యూలో నాటౌట్ అని తేలితే, దాన్ని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు. దీంతో నాలుగు పరుగులు బంగ్లా ఖాతాలో చేరలేదు. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్ నాలుగు పరుగుల తేడాతో ఓడిపోవడంతో అంపైర్ చేసిన తప్పుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇక రబడా వేసిన 18 ఓవర్ తొలి బంతికి హృదయ్ నాటౌట్ అయినా.. అంపైర్స్ కాల్ తో దక్షిణాఫ్రికాకు వికెట్ దక్కింది. పరోక్షంగా అంపైర్ చేసిన ఈ రెండు తప్పులు ఓటమిపై ప్రభావం చూపించాయి.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 113/6 స్కోరు మాత్రమే చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (44 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46), డేవిడ్ మిల్లర్ (29), డికాక్ (18) తప్ప మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు. ఛేజింగ్‌లో ఓవర్లన్నీ ఆడిన బంగ్లా 109/7 స్కోరుకే పరిమితం అయింది. తౌహిద్ హృదయ్ (37), మహ్ముదుల్లా (20) పోరాడినా ఫలితం లేకపోయింది.