పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై ఉమ్టా సర్వే .. సిటీలో రోడ్ ​డెవలప్​మెంట్​ ప్లాన్​పై కసరత్తు

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై  ఉమ్టా సర్వే .. సిటీలో రోడ్ ​డెవలప్​మెంట్​ ప్లాన్​పై కసరత్తు

 

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్​సిటీలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఈజీ చేయడ మే లక్ష్యంగా యూనిఫైడ్​మెట్రోపాలిటన్​ట్రాన్స్​పోర్ట్​అథారిటీ(ఉమ్టా) ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. హెచ్ఎండీఏ పరిధిలో ట్రాఫిక్​ప్రాబ్లమ్స్, నివారణ చర్యలు, ట్రాన్స్ పోర్ట్ మెరుగు పర్చేలా త్వరలో సిటీలో మరో కొత్త ట్రాఫిక్​ సిస్టమ్ ను ప్రవేశపెట్టనుంది. ఇందుకు పోలీసు, రవాణా, ఆర్టీసీ, మెట్రోరైల్, రైల్వే, బల్దియా కో ఆర్డినేషన్ తో  సమగ్ర కాంప్రెహెన్సీవ్​ ట్రాఫిక్​సిస్టం(సమగ్ర ట్రాఫిక్​ విధానం) రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది.  రోజు రోజుకూ పెరిగే ట్రాఫిక్​ సమస్యలకు కారణాలు తెలుసుకోవడమే కాకుండా ప్రజా రవాణా మరింత మెరుగు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఉమ్టా ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది. సిటీలో 10వేల మందిని శాంపిల్​గా తీసుకుని సర్వే చేస్తున్నట్టు ఉమ్టా ఉన్నతాధికారులు తెలిపారు. ఒక్కో కుటుంబంలో ఎంత మంది రోజూ ప్రయాణాలు చేస్తుంటారు. ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్లడానికి దేనికి ప్రాధాన్యత ఇస్తుంటారనే విషయాలను సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. ట్రాఫిక్​నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఇంటింటి సర్వేలో భాగంగా ప్రజల నుంచి ఫీడ్​బ్యాక్​ కూడా తీసుకుంటున్నారు. తద్వారా  సిటీలో భవిష్యత్ లో ఎలాంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అమలు చేయాలనేది తెలుస్తుంటున్నారు. ట్రాఫిక్​ సమస్య నివారణకు చర్యలు తీసుకునేందుకు చాన్స్ కూడా ఉంటుందంటున్నారు. 

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎక్కువగా వినియోగించేలా..

సిటీ రోడ్లపై రోజుకు 80లక్షల వాహనాలు తిరుగుతుండగా, కొత్తగా వేల సంఖ్యలో వస్తున్నాయి. దీంతో ట్రాఫిక్​సమస్యలు తీవ్రమవుతున్నాయి. ప్రజలు సొంత వాహనాలను తక్కువ వాడుతూ.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అయిన బస్​లు, మెట్రో, ఎంఎంటీఎస్​వంటివి ఎక్కువగా వినియోగించుకునేలా చేయడం ద్వారా ట్రాఫిక్​రద్దీని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా బస్టాండ్స్​, మెట్రోస్టేషన్లు, రైల్వే స్టేషన్లకు 500 మీటర్ల రేడియస్​లో పార్కింగ్​లాట్స్​ఏర్పాటు ద్వారా రోడ్లపైకి వాహనాలు రావడాన్ని అడ్డుకోవచ్చని కూడా ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రత్యేక పార్కింగ్​ లాట్స్ 

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వైపు ఎక్కువగా ప్రజలను మళ్లించడం ద్వారా సిటీలో ట్రాఫిక్​ సమస్య నివారణకు చాన్స్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్ల ఏరియాల్లో ప్రతేకంగా పార్కింగ్​లాట్స్​ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. సిటీలో హారిజాంటల్ గా కాకుండా వర్టికల్​గా విస్తరించేలా అభివృద్ధి జరగాలని కూడా సూచనలు చేస్తున్నట్టు తెలిపారు. దీంతో ట్రాఫిక్​ సమస్యలను తగ్గించవచ్చంటున్నారు. సిటీలో పలు చౌరస్తాలను, జంక్షన్లను కూడా విస్తరించాల్సి ఉందని ఉమ్టా భావిస్తోంది. ట్రాఫిక్​ సమస్య నివారణ, పార్కింగ్ లాట్స్ నిర్మాణం, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ప్రోత్సహించడం వంటి ప్రధాన అంశాలపై త్వరలో వివిధ కీలక శాఖలతో సమావేశం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇంటింటి సర్వే, ట్రాఫిక్​ సమస్యల నివారణ వంటి పలు అంశాలపై ఒక నివేదికను ప్రభుత్వానికి త్వరలోనే ఇవ్వనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.