నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఓ నిరుద్యోగి.. వినూత్న రీతిలో నామినేషన్ దాఖలు చేశారు. చిరిగిన అంగి, మెడలో ఖాళీ బీరు సీసాలను వేసుకొని బెగ్గర్ అవతారం ఎత్తి.. బంగారు తెలంగాణ కాదు.. అడుక్కుతినే తెలంగాణ .. నిరుద్యోగుల బతుకు ఆగం చేసిన కేసీఆర్ అంటూ ఫ్లకార్డును చేతిలో పట్టుకుని ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్ డి స్కాలర్ కంభంపాటి సత్యనారాయణ అనే నిరుద్యోగి వినూత్న రీతిలో ప్రచారం చేశారు. మునుగోడులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యనారాయణ.. 2023, నవంబర్ 10వ తేదీ శుక్రవారం నామినేషన్ వేశారు.
అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ.. గజ్వేల్ ని అభివృద్ధి చేసినట్లు మునుగోడుని ఎందుకు అభివృద్ధి చేయలేదని... ఒకే రాష్ట్రంలోని ఇతర జిల్లాలపై మీకు ఇంత వివక్షనా అని మండిపడ్డాడు. తెలంగాణ వస్తే 92 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. 10 సంవత్సరాలు గడిచినా నోటిఫికేషన్ వెయ్యకుండా కాలయాపన చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటికో పింఛన్ ఇస్తున్నానని చెప్తున్న కేసీఆర్.. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎందుకు చెప్పట్లేదని అన్నారు. ఇంటికి క్వాటర్, బీర్లు పంపుతూ.. తాగుబోతుల తెలంగాణ చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కి ఓటు వేస్తే నిరుద్యోగులు బిక్షం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందని, రైతులు కూడా బిక్షం ఎత్తుకొక తప్పదన్నారు. కేసీఆర్ ని రాజకీయ నిరుద్యోగి చేయడమే తమ లక్ష్యమని అన్నారు.