ఐక్యరాజ్యసమితి.. ప్రపంచ దేశాల మధ్య తగాదాలను తీర్చే పెద్దన్న. యుద్ధాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పేదలను మానవత్వంతో ఆదుకునే మనసున్న సంస్థ. ఈ అంతర్జాతీయ సంఘం ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక అష్టకష్టాలు పడుతోంది. 230 మిలియన్ డాలర్ల లోటుతో భారంగా నెట్టుకొస్తోంది. 37 వేల మంది ఉద్యోగులకు వచ్చే నెల జీతాలు ఇచ్చే స్తోమత లేక దీనంగా చూస్తోంది. 193 సభ్య దేశాల్లో 64 దేశాలు బాకీ పడటం వల్లే సమితికి ఈ సమస్య వచ్చింది. పేమెంట్లు ఇవ్వని దేశాల లిస్టులో ఇండియా లేకపోవటం విశేషం.
మరో ప్రపంచ యుద్ధం రాకుండా చూడటంలో దాదాపు 75 ఏళ్లుగా సక్సెస్ అవుతున్న ఐక్యరాజ్యసమితిని ఆర్థిక సమస్యలు తీవ్రంగా చుట్టుముట్టాయి. ప్రతి సంవత్సరం ఓవరాల్ ఆపరేటింగ్ బడ్జెట్ బిలియన్ డాలర్లలో ఉండటం, సభ్య దేశాలు చందాలను ఎగ్గొట్టడంతో డబ్బుల్లేక డీలా పడింది. ఉద్యోగులకు వచ్చే నెల జీతాలు ఇవ్వటానికే కాదు.. చివరికి మీటింగ్‌లు పెట్టడానికి కూడా సంస్థ దగ్గర సరిపోను నిధుల్లేని దుస్థితి ఏర్పడింది. సెప్టెంబర్ నెలాఖరికి సమితి 200 మిలియన్ డాలర్లకుపైగా లోటుతో దినదిన గండంలా గడుపుతోంది.
కంట్రిబ్యూషన్స్ చెల్లించకుండా కాలం వెళ్లబుచ్చుతున్న కంట్రీస్ లిస్టులో అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో, ఇరాన్, వెనెజులా; నార్త్, సౌత్ కొరియాలు; కాంగో, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి 64 దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏ దేశాలు బకాయి పడ్డాయో సమితి అఫిషియల్‌గా చెప్పదు. అయితే ఖజానా నిండుకోవటంపై యూఎన్ఓ సెక్రటేరియట్ లేటెస్ట్గా ఉద్యోగులకు లెటర్ రాయటం చర్చనీయాంశమైంది. ఇది జరిగిన తెల్లారే యూఎన్ఓ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా స్పందించారు.
వచ్చే పదేళ్లు మరింత వరస్ట్!
పరిస్థితిలో మార్పు రాకపోతే వచ్చే పదేళ్లు మరింత వరస్ట్‌గా గడుస్తాయని గుటెరస్ హెచ్చరించారు. సంస్థ వద్ద ఉన్న లిక్విడిటీ రిజర్వ్‌లు అక్టోబర్ నెలాఖరికి మరిన్ని అడుగంటుతాయని, ఫలితంగా స్టాఫ్‌కి, వెండర్లకి పేమెంట్లు చేయలేక డిఫాల్ట్ కావాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సివిల్ వార్తో చితికిపోయిన సిరియా సైతం కంట్రిబ్యూషన్‌ని వాయిదా వేయకుండా ఇచ్చిందని యూఎన్ఓ స్పోక్స్ మ్యాన్ స్టీఫేన్ డుజారిక్ రోజువారీగా ఏర్పాటు చేసే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మొన్నే తెలిపారు.
సమితి ఇటీవల ఆర్థికంగా దిగజారుతుండటంతో ఈ ఏడాది ఆరంభం నుంచే ఖర్చులను తగ్గించే కార్యక్రమం మొదలుపెట్టామని, లేకపోతే ఈపాటికి లోటు 600 మిలియన్ డాలర్లకు చేరేదని ఆయన వివరించారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం వల్లే సెప్టెంబర్‌లో జనరల్ అసెంబ్లీని విజయవంతంగా నిర్వహించామని, ఆ భేటీకి ప్రపంచ దేశాల నేతలు హాజరయ్యారని అన్నారు. చందాలు కట్టిన 129 దేశాలకు ఆంటోనియో గుటెరస్ ‘థ్యాంక్స్’ చెప్పారు. డ్యూ ఉన్న దేశాలు అర్జెంట్‌గా ఫుల్ పేమెంట్లు చేయాలని కోరారు.
పీస్ కీపింగ్ ఖర్చులు మినహా సమితి 2018–19లో వివిధ ఆపరేషన్స్‌కి కేటాయించిన బడ్జెట్టే దాదాపు 5.4 బిలియన్ డాలర్లు. ఇందులో 22 శాతాన్ని అమెరికా భరిస్తోంది. కానీ ఆ దేశం ఇప్పటి వరకు సుమారు 1.4 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. పీస్ కీపింగ్‌కి ఎక్కువ నిధులు ఇచ్చేది అమెరికానే. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక యూఎన్‌కి చెల్లించే ఫండ్స్ విషయంలో ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. కంట్రిబ్యూషన్స్లో కోతలు పెడుతూ, కాస్ట్ సేవింగ్ రిఫార్మ్స్ని ముందుకు తెస్తోంది.
పట్టించుకోని సభ్య దేశాలు
ఇప్పటి నుంచి ఈ ఏడాది చివరి వరకు ఖర్చులపై మరిన్ని పరిమితులు విధిస్తామని, ఇందులో భాగంగా కొన్ని కాన్ఫరెన్స్‌లను, మీటింగ్‌లను వాయిదా వేసే సూచనలు ఉన్నాయని యూఎన్ఓ చీఫ్ గుటెరస్ చెప్పారు. ముఖ్యమైన అఫిషియల్ ప్రయాణాలను నిలిపేయబోమని, కాకపోతే సర్వీసులను కొంచెం తగ్గిస్తామని స్పష్టం చేశారు. కాస్ట్ కట్ చర్యలను గుటెరస్ ఇప్పటికిప్పుడు మొదలుపెట్టలేదని, బడ్జెట్ ఇష్యూస్‌ని కొంత కాలంగా సభ్య దేశాలతో ప్రస్తావిస్తూనే ఉన్నా అవి పట్టించుకోవట్లేదని యూఎన్ఓ ఆఫీసర్లు గుర్తుచేస్తున్నారు.