ప్యారిస్​లో గాజా విషాదఛాయలు.!

ప్యారిస్​లో  గాజా విషాదఛాయలు.!

గాజాలో ఇజ్రాయెల్ సృష్టిస్తున్న మారణ హోమం ఛాయలు ప్యారిస్​లో  జరుగుతున్న ఒలింపిక్స్​లో కనిపిస్తున్నాయి. పుట్టెడు దుఃఖంలో పాలస్తీనీయుల 'గాజా' ఉంది.  ఇజ్రాయెల్ దాష్టీకం వల్ల 40 వేల మంది దాకా ఊపిరి కోల్పోయారు.  మరోవైపు మృతుల సంఖ్య లక్ష 90 వేల పైమాటే  అంటున్నారు.  ఫ్రాన్స్​లోని  ప్యారిస్ లో  విశ్వక్రీడలు జరుగుతున్నాయి.  వివిధ దేశాల్లో ఉన్న పాలస్తీనా అథ్లెట్స్ ఎనిమిది మంది,  గాజా విధ్వంస భూమిలో ఉన్న ఇద్దరు విశ్వక్రీడల్లో పాల్గొంటున్నారు.  ఇజ్రాయెల్ బాంబుదాడుల్లో 300 మంది దాకా జాతీయ, అంతర్జాతీయ  క్రీడాకారులు మరణించారు. ఇందులో గత ఒలింపిక్స్​లో పాల్గొన్నవారు సైతం ఉన్నారని సమాచారం.  క్రీడాకారుల సౌకర్యాలను సైతం  ఇజ్రాయెల్ సైనికులు ధ్వంసం చేశారు.  మన దేశం నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొని  క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు.  తాజాగా ప్యారిస్​లో మూడు రైల్వే లైన్స్ మీద దాడి జరిగింది.  పలు రైళ్లు ఆలస్యంగా నడవడమే కాకుండా కొన్ని రద్దు అయ్యాయి. ఎనిమిది లక్షల మందికి పైగా ప్రయాణికులు రైల్వే స్టేషన్లలోనే చిక్కుకుపోయారు. ఈ పరిస్థితి కారణంగా ప్యారిస్ లో కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లు చేశారు.

గాజాలో పరిస్థితి దయనీయం

గత ఒలింపిక్స్​లో పాల్గొన్న పాలస్తీనాకు చెందిన వెయిట్ లిఫ్టర్ మహమ్మద్ హమీద్ ఫిట్నెస్ లేని కారణంగా క్వాలిఫై కాలేదు.  కారణం ప్రస్తుతం గాజాలో ఉన్న దయనీయ పరిస్థితి. అక్కడ స్థానికుల జీవితం దినదిన గండం అయిపోయింది. ఉక్రెయిన్​ మీద  రష్యా యుద్ధం కారణంగా.. గతంలో రష్యా క్రీడాకారుల మీద ప్రపంచ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్స్​లో పాల్గొనకుండా అనర్హతను ప్రకటించింది. 1970లోనూ  ఒక వర్గం పట్ల అనుచితంగా వ్యవహరించినందుకు దక్షణాఫ్రికా  క్రీడాకారులనూ ఆడనీయలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ టీమ్​ను కూడా బహిష్కరించాలని, వారిని ఒలింపిక్స్​లో  ఆడనీయకుండా యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ వచ్చింది. పాలస్తీనా ప్రజలకు  మద్దతుగా ప్యారిస్​లో  జనం ప్రదర్శనలు నిర్వహించారు. నిజానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు 'గాజా' లో టెర్రరిస్టుల చెర నుంచి ఇజ్రాయెలీలను విడిపించడం కోసం యుద్ధం చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రపంచ అంతర్జాతీయ న్యాయస్థానం గాజా మీద దాడిని  నరమేధంగా పేర్కొన్నది. యుద్ధం ఆపాలని నెతన్యాహును కోరినా ఆయన  ఖాతరు చేయలేదు.

ఇజ్రాయెల్​ను ఎందుకు బహిష్కరించకూడదు?

రష్యాను ఒలింపిక్స్​లో  బహిష్కరించినపుడు ఇజ్రాయెల్​ను ఎందుకు బహిష్కరించకూడదు అని ప్యారిస్​లో డిమాండ్ కొనసాగుతున్నది. యుద్ధ విరమణ ఆదేశాలు పాటించని  నెతన్యాహు అమెరికా వెళ్లితే అక్కడ ఆయనకు సన్మానాలు జరుగుతాయి.  ఒలింపిక్స్​లో ప్రపంచ సోదర భావం పెంపొందుతుంది. ఇది క్రికెట్ మాదిరి కేవలం 12 దేశాలకే పరిమితం అయ్యో ఇంటర్నేషనల్​ ఆట కాదు. మొత్తం 206 దేశాలు,10,500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ప్రపంచం అంతా ఎదురుచూసే  క్రీడలు.  క్రీడా కమిటీ నిబంధనల ప్రకారం క్రీడా పోటీలకు వారం ముందు నుంచి.. ఏ దేశం కూడా  మరో దేశం మీద యుద్ధం చేయకూడదు. 

యుద్ధవిరమణ ఉండాలి. యుద్ధం కొనసాగిస్తుంటే అది ఒలింపిక్స్ కమిటీ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఆ దేశానికి క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉండదు. కానీ, ఇప్పటిదాకా అన్ని ఉల్లంఘనలకు పాల్పడిన ఇజ్రాయెల్ పట్ల ఉదాసీనత ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. గాజాలో అమానవీయ ఇజ్రాయెల్ ప్రధాని  నెతన్యాహు చర్యలను మానవత్వం ఉన్న దేశాలన్నీ నిరసించాలి.  భారతదేశం కూడా గాజా విషాదాన్ని పట్టించుకోవాలి. కాగా..మన దేశం నుంచి పాల్గొంటున్న క్రీడాకారులు అందరికీ ఆల్ ది బెస్ట్!

- ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్