ఆనందాన్ని కబళిస్తున్న అధికారం

ఆనందాన్ని కబళిస్తున్న అధికారం

‘‘ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే అనురాగపు అంచులు చూస్తాం, ఆనందపు లోతులు తీస్తాం’’ అంటారు మహాకవి శ్రీశ్రీ ఓ కవిత(మహాప్రస్థానం)లో. మనిషి జీవన అంతిమ లక్ష్యం అవధుల్లేని ఆనందమే!  అందుకేనేమో... ‘అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం’ అంటాడు మరో సినీకవి. అటువంటి ఆనందం మనలో కరువవుతోంది. సుఖానికి, సంతోషానికీ తేడా లేదనుకునే మాలోకాలు ఈ లోకంలో పెచ్చు మీరుతున్నారు. సుఖంగా ఉండటానికి వెంపర్లాడుతూ సుఖానికిచ్చిన ప్రాధాన్యత సంతోషానికి, ఆనందానికీ ఇవ్వట్లేదు. సుఖం వేరు ఆనందం వేరు. సౌఖ్యం కన్నా కూడా ఆనందంగా ఉండటమే మనిషి ఎదుగుదలకు, జీవన ప్రమాణాల వృద్ధికి కొలమానం! మనిషి ఆనందంగా ఉండటం విషయంలో మన పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ప్రపంచ ఆనంద నివేదిక 2022 ప్రకారం లెక్కించిన మొత్తం149 దేశాల్లో ఇండియాది136వ స్థానం. చాలా ఆసియా దేశాలు మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. 

భారతీయుల్లో ఆనందం కరువైపోవడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా, బహుళ సంఖ్యాకుల్లో జీవన ప్రమాణాలు పెరుగకపోవడమే ముఖ్య కారణం. అసంతృప్తి, అలసట, అశాంతి, అసహనం, అచేతన(పేదరికం వల్ల)... వంటివన్నీ తెలియకుండానే ఆనందాన్ని మనకు దూరం చేస్తాయి. మనిషి ఆలోచన, సామాజికార్థిక, రాజకీయ పరిస్థితులు కూడా ఇందుకు కారణమే! అసాధారణంగా పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, నిరుద్యోగిత, అవినీతి, మనిషి నిత్య జీవితాన్ని బాగా ప్రభావితం చేసే విద్య, వైద్య రంగాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం, మరో పక్క కార్పొరేట్ల దోపిడీ, మనిషి దైనందిన జీవితంలోకి ‘అధికారం’ తాలూకు అతి,అనుచిత జోక్యాలు. ఇలాంటివన్నీ మనిషి ఆనందపు సూచీని తిరోగమనంలో నడిపే ప్రభావకాలే. సంపద ఆనందానికి ఏకైక కారణం కానట్టే ప్రతీక కూడా కాదు. సంపన్న దేశాలు ఆనందపు సూచీలో ఎక్కడో ఉన్నాయి. దేశ సామాజికార్థిక విధానాలు, ప్రజలకు కల్పించే అవకాశాలు, సామాజిక భద్రత, విద్య, వైద్యం విషయంలో తీసుకునే శ్రద్ధ, స్థూల జాతీయోత్పత్తి వంటి అంశాలే దేశ ప్రజల సగటు ఆనందాల్ని, సదరు సూచీని నిర్ధారిస్తాయి. ఆయా విషయాల్లో మన పరిస్థితేం బాగోలేదు.
జనాభా ఒకటే సమస్య కాదు
మానవాభివృద్ధిలో అయినా, మనిషి ఆనందాల సూచీలో అయినా... ఉత్తర ఐరోపా దేశాలే ఎప్పుడూ అగ్రభాగాన ఉంటున్నాయి. అవి చిన్న దేశాలే. వాటితో పోలిస్తే మనది పెద్ద దేశం. పైగా ఎక్కువ జనాభా ఉన్న దేశం. అలా అని, జనసాంద్రత వల్లే ఈ సమస్యలన్నీ అనుకోవడం కూడా సరికాదు. నాలుగేండ్లుగా ఆనందపు సూచీలో ఫిన్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రభాగాన ఉంటోంది. ఈసారి తదుపరి స్థానాలు డెన్మార్క్‌‌‌‌‌‌‌‌, స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌, ఐస్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌, ది నెదర్లాండ్‌‌‌‌‌‌‌‌, నార్వే, స్వీడన్‌‌‌‌‌‌‌‌లకు దక్కాయి. శ్రీలంక(128) కూడా ఆనందపు సూచీలో మనకన్నా కొంచెం నయమే. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌(103), బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌(99), చైనా (82) కూడా మెరుగ్గానే ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌(149) సూచీలో అట్టడుగున ఉంది. దానికి ముందు జింబాబ్వే(148), రువాండా(147), బోట్స్వానా(146), లెసోతా(145) వంటి దేశాలు అధమ ర్యాంకుల్లో ఉన్నాయి. ఆయా దేశాల పౌరులు కొందరిని వ్యక్తిగతంగా కలిసి, ఇంకొందర్ని టెలిఫోన్‌‌‌‌‌‌‌‌ ద్వారా సంప్రదించి సమాచారం సేకరించడం ద్వారా ఈ నివేదికను ఐక్యరాజ్యసమితి (యూఎన్‌‌‌‌‌‌‌‌)కి చెందిన సుస్థిరాభివృద్ధి, పరిష్కారాల విస్తృత యంత్రాంగం రూపొందించింది. ‘గ్యాలప్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ పోల్‌‌‌‌‌‌‌‌’ ద్వారా ఈ అధ్యయనం జరిపింది. తామెంత ఆనందంగా ఉన్నామో పౌరులే తెలియజేసే సమాచారానికి తోడు ఆయా దేశాల తలసరి స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ), సామాజిక భద్రత, జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, జీవన వ్యవధి, స్వీయ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, పౌరుల ఉదారత, అవినీతి స్థాయి వంటి అంశాల్ని క్రోడీకరించి నివేదిక సమర్పించింది.

కరోనాను ఎదుర్కొన్న తీరూ ఓ కొలతే!

ప్రపంచ పౌరుల్లో ఆనందాల స్థాయిని లెక్కించే ఈ ప్రక్రియను యూఎన్‌‌‌‌‌‌‌‌ 2002 నుంచి చేపట్టింది. ఈ సారి ఆయా దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కున్న తీరు, అందుకు ఇచ్చిన ప్రాధాన్యత, కల్పించిన వ్యవస్థలు వంటి అంశాల్ని కూడా లెక్కలోకి తీసుకుంది. ఒత్తిడిని తగ్గించుకొని ఆరోగ్యంగా, ఉల్లాసంగా, స్వీయ నిర్ణయాల స్వేచ్ఛ, సమానత్వ భావనతో పౌరులు గడుపగలిగే దేశాలే ఆనందపు సూచీలో శీర్షభాగాన ఉంటున్నాయి. గరిష్టంగా10 పాయింట్లు సాధించ గలిగే ఈ లెక్కలో అత్యధికంగా 7.84 పాయింట్లు సాధించిన ఫిన్లాండ్‌‌‌‌‌‌‌‌ జీవితేచ్చపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలిగే అవకాశాల్లో అగ్రభాగాన ఉంది. జీడీపీతో పాటు పలు ఇతర విషయాల్లో మెరుగ్గా ఉండటం వల్ల డెన్మార్క్‌‌‌‌‌‌‌‌(7.6) ఎంపికైంది. ఆరోగ్యం విషయంలో సంతృప్తిస్థాయి సాధించిన స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌(7.5)లో ఉద్యోగుల జీతాలూ మెరుగే. సంపన్న దేశం అమెరికాలోని ఉద్యోగుల జీతాల సగటు కన్నా75 శాతం ఇక్కడ అధికం అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది.

మాటల కన్నా చేతలే ముఖ్యం

చాతుర్యంతో మాటలు చెప్పడం కన్నా శ్రద్ధతో చర్యలు చేపట్టి ఫలితాలు చూపడమే ఏ ప్రజాస్వామ్య పాలనలోనైనా ముఖ్యమైన ప్రక్రియ. అలా చేసినపుడే ఆర్థిక ప్రగతి, దానికి తోడు మానవాభివృద్ధి సూచీలో మెరుగైన స్థానం దక్కుతుంది. అది సహజంగానే పౌరుల ఆనందపు స్థాయిని, తద్వారా ప్రపంచ సూచీలో దేశం సాధించే స్థానాన్ని మెరుగుపరుస్తుంది. ఈ విషయంలో మనది ఎంతో అవమానకరమైన స్థాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకొని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతలు మార్చుకొని ప్రజాకేంద్రక పాలనను అందిస్తే తప్ప ఆయా అంశాల్లో మెరుగుపడే సూచనలు కనిపించడం లేదు. కార్పొరేట్లకు దన్నుగా నిలవటం కాకుండా సామాన్యుడికి మేలు చేసే సామాజికార్థిక ప్రణాళికను ప్రకటించి, అమలు పరచాలి. కరోనా కాలంలో పేదలు మరింత పేదరికంలోకి జారితే, సంపన్నులు ఇంకెంతో సంపదను వృద్ధి చేసుకున్నారు. 23 నుంచి 27 శాతం జనాభా కొత్తగా దారిద్య్ర రేఖ దిగువకు జారితే, కుబేరుల సంఖ్య, వారి సంపద గణనీయంగా పెరగటం ఇందుకు సంకేతం. ప్రపంచవ్యాప్తంగా భారత్‌‌‌‌‌‌‌‌ జనాభాలో (2), ఉత్పత్తిలో (3), ఆర్థిక యోగ్యత, కొనుగోలు శక్తి(పీపీపీ)లో (3), ఆర్థిక స్థోమత, జీడీపీలో(6), విస్తీర్ణంలో(7) అగ్ర స్థానాల్లో ఉంది. కానీ, ఇతరేతరమైన కీలక విషయాల్లో, ముఖ్యంగా మానవాభ్యుదయాన్ని సూచించే విషయాల్లో మన పరిస్థితి చాలా అధ్వానంగా ఉండటం తలవంపులు తెచ్చేదే. 

దాష్టీకాలు మంచివి కావు..

కనీస ప్రభుత్వం.. గరిష్ట పాలన అన్న నినాదం ఆచరణకు నోచడం లేదు. సగటు మనిషి దైనందిన జీవితంలోకి ‘రాజ్యం’ దాష్టికత, ‘అధికారం’ విచ్ఛలవిడితనం, చొచ్చుకు వచ్చిన కిరాతకాల వల్లే లెక్కలేనన్ని అరిష్టాలు జరుగుతున్నాయి. భయాల వల్ల బయటపడక, పాలకుల దురహంకారానికి జడిసి నోరిప్పక... లెక్కలకెక్కని దుర్మార్గాలు ఇంకా ఎన్నెన్నో.! ఒక మంత్రి పేరు చెప్పి(కర్ణాటక), ఒక ఎమ్మెల్యే కొడుకు పేరు చెప్పి(కొత్తగూడెం), ఒక మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పేరు చెప్పి(నిజామాబాద్‌‌‌‌‌‌‌‌), అధికారుల పేరు చెప్పి(మెదక్‌‌‌‌‌‌‌‌), పోలీసుల పేరు చెప్పి(ఖమ్మం) ఇలా నిత్యం సామాన్య జనం దయనీయంగా ఆత్మహత్యలు చేసుకుంటుంటే, బలవన్మరణాలకు పాల్పడుతుంటే.... చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు కారణం కాదా పౌరుల్లో ఆనందం కనుమరుగవడానికి? ఇది ప్రజలు ఆలోచించాలి. ఏం చేసైనా దీనికి చరమగీతం పాడాలి. ‘ఆనందమే అంతిమ జీవిత లక్ష్యం’ అని విశ్వానికి బోధించిన భగవద్గీత పుట్టిన నేలలో ఇన్ని అరిష్టాలు, ఇంతటి దాష్టీకాలు మంచివి కావు. 
- దిలీప్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
డైరెక్టర్‌‌‌‌‌‌‌‌, పీపుల్స్‌‌‌‌‌‌‌‌ పల్స్‌‌‌‌‌‌‌‌