- మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో ఘటన
మేడిపల్లి, వెలుగు: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో శనివారం జరిగింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ఐఎన్ కాలనీలో నివాసం ఉంటున్న జి. శ్రీనివాస్ (34).. మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య కూడా పోలీస్ డిపార్ట్ మెంటులో ఆర్ఎస్సైగా పనిచేస్తున్నది. వీరిది ప్రేమ వివాహం. వారికి ఒక కూతురు ఉంది.
గత కొన్నాళ్లుగా శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. శనివారం తీవ్ర మనస్తాపానికి గురై సాయంత్రం ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు దవాఖానాకు తరలించారు. అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.