కొడుకు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

శంకరపట్నం, వెలుగు : కొడుకు మృతి తట్టుకోలేక తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్‌‌ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌‌పల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన గడ్డి కనకమ్మ (60) భర్త నాలుగు నెలల కింద చనిపోయాడు. పెద్ద కొడుకు సంపత్‌‌ వేరే ఇంట్లో ఉంటుండగా, కనకమ్మ మానసిక వికలాంగుడైన చిన్న కొడుకు రాజయ్య(43)తో కలిసి ఉంటోంది. బుధవారం తెల్లవారుజామున కనకమ్మ లేచి చూసేసరికి రాజయ్య చనిపోయి కనిపించాడు. 

దీంతో మనస్తాపానికి గురైన కనకమ్మ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకింది. కొద్ది సేపటి తర్వాత పెద్దకొడుకు సంపత్‌‌ రాగా రాజయ్య చనిపోవడం, తల్లి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. ఇంటి సమీపంలోని బావి వద్ద చెప్పులు, కాళ్ల అచ్చులు కనిపించడంతో మూడు మోటార్లు పెట్టి నీటిని తోడించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి వివరాలు సేకరించారు. గ్రామస్తుల సహకారంతో బావి నుంచి కనకమ్మ డెడ్‌‌బాడీని బయటకు తీశారు. తన తండ్రి, తమ్ముడు చనిపోవడంతో మానసిక క్షోభకు గురై తల్లి బావిలో దూకిందని సంపత్‌‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవి తెలిపారు