
మేడ్చల్, వెలుగు: మేడ్చల్‌లో పట్టపగలే నడిరోడ్డుపై జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పన్నెండు గంటల్లోనే మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ కోటిరెడ్డి సోమవారం వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుగులోతు గన్యాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు.
ఆయన పెద్ద కొడుకు ఉమేశ్ (24)కు పెండ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. లేబర్‌గా పనిచేస్తున్న ఉమేశ్ మద్యం సేవిస్తూ తన భార్య, తల్లి, చెల్లి, తమ్ముడితో తరచూ గొడవ పడేవాడు. ఎన్నిసార్లు వద్దని వారించినా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తానే హత్య చేసినట్లు తమ్ముడు రాకేశ్ అంగీకరించారు. ఇందుకు తనతో పాటు ఫ్లిప్ కార్ట్ లో పనిచేసే వాళ్ల చిన్నాన్న కొడుకు లక్ష్మణ్, మరో ముగ్గురు బంధువులు నవీన్, సురేశ్, నరేశ్ సహాయం తీసుకున్నట్లు తెలిపాడు.
హత్యకు గురైనా ఉమేశ్ పై కామారెడ్డి జిల్లాలో చైన్ స్నాచింగ్ తో పాటు 14 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.