భర్త వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్లో మహిళ ఆత్మహత్య

భర్త వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్లో మహిళ  ఆత్మహత్య

అంబర్​పేట, వెలుగు: భర్త వేధింపులు తట్టుకోలేక అంబర్ పేట పటేల్ నగర్ లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని ఇస్సానగర్ కు చెందిన రేఖ(27)కు 2018లో అంబర్ పేటకు చెందిన పిడుగు నవీన్(37)తో వివాహమైంది. స్క్రాప్ వ్యాపారం చేసే నవీన్​మద్యానికి బానిసయ్యాడు. కొన్నాళ్లుగా రేఖ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ వేధిస్తున్నాడు. 

రోజూ తాగొచ్చి భార్యతో గొడవ పడుతున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన రేఖ ఈ నెల10న సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను నవీన్​ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించాడు. తర్వాత మెరుగైన వైద్యం కోసం రేఖ తల్లిదండ్రులు కాచిగూడలోని టీఎక్స్ హాస్పిటల్ కు మార్చారు. 

చికిత్స పొందుతున్న రేఖ ఆదివారం తెల్లవారుజామున చనిపోయింది. తన అల్లుడే బైక్ లో పెట్రోల్ తీసి రేఖను కాల్చి చంపాడని మృతురాలి తల్లిదండ్రులు అంబర్​పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.