పంటి నొప్పి భరించలేక గోదావరిలో దూకి ఆత్మహత్య

  •     జీవితంపై విరక్తితో తనువు చాలించిన మరొకరు  
  •     పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విషాదాలు

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వద్ద గోదావరినదిలో దూకి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఒకరు పంటి నొప్పిని భరించలేక సూసైడ్​ చేసుకోగా, మరొకరు మానసివ వేదనతో బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం...గోదావరిఖని తిలక్‌‌నగర్‌‌కు చెందిన ఎండీ ఆజీమొద్దీన్‌‌ (30) ఇంటర్నెట్‌‌ షాప్‌‌ నిర్వహిస్తుంటాడు. ఇతడికి భార్య, ఎనిమిది నెలల కొడుకు ఉన్నారు. చాలా రోజులుగా అజీమొద్దీన్‌‌ పంటినొప్పితో బాధపడుతున్నాడు. గతంలో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకున్నప్పటికీ తగ్గకపోవడంతో ఇబ్బందికి గురై ఈ నెల 23న ఇంట్లో నుంచి వెళ్లి గోదావరినదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు గౌసోద్దీన్‌‌ ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్‌‌టౌన్‌‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే గోదావరిఖని శివాజీనగర్‌‌లో ఉండే కొయ్యడ శివరాములుకు సంతోష్‌‌, రాకేశ్‌‌ (33) కొడుకులు. శివరాములు సింగరేణిలో పనిచేసి 2016లో రిటైర్డ్‌‌ అయిన తర్వాత పెద్దపల్లికి షిఫ్ట్​ అయ్యాడు.

పెద్ద కొడుకు సంతోష్‌‌ గోదావరిఖనిలో ఉంటూ జైపూర్‌‌ పవర్‌‌ ప్లాంట్‌‌లో కార్మికుడిగా పనిచేస్తుండగా రాకేశ్‌‌ ఎలాంటి పనిలేకుండా తిరిగేవాడు. ఇటీవల తల్లిదండ్రులపై హత్యాప్రయత్నంతో పాటు సోదరుడిపై దాడి చేయడంతో పోలీస్‌‌ కేసు నమోదైంది. దీంతో అతడిని జైలుకు పంపించారు. మూడు నెలల క్రితం రాకేశ్​ను అతడి తండ్రి జైలు నుంచి విడిపించుకువచ్చాడు. తర్వాత పెద్దపల్లిలో తానుండే చోటుకు దగ్గరలో ఓ ఇంటిని కిరాయికి తీసుకుని అందులో ఉంచాడు. రాకేశ్‌‌కు తరుచుగా ఫిట్స్‌‌ వస్తుండడంతో బెంగుళూరు హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌ మెంట్‌‌ ఇప్పిస్తున్నాడు. గురువారం బెంగుళూర్‌‌ వెళ్తానని చెప్పి ట్రైన్‌‌ టికెట్ ​కూడా తెచ్చుకున్నాడు. కాగా, ఈ నెల 19న రాత్రి పెద్దపల్లిలో కిరాయి ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాకేశ్​ గురువారం గోదావరి నదిలో శవమై కనిపించాడు. ఒంటరిగా ఉండడం, ఫిట్స్‌‌ తగ్గకపోవడంతో ఎందుకు బతకాలనే భావనను సోదరుడి వద్ద వ్యక్తపరిచేవాడని, ఈ క్రమంలోనే నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రాకేశ్‌‌ తండ్రి శివరాములు గోదావరిఖని టూ టౌన్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌‌ఐ ఎస్‌‌కె ఫరీద్‌‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.