
- ఆపసోపాలు పడుతూ దవాఖానాకు.. మగబిడ్డకు జననం
కాగజ్ నగర్, వెలుగు : ఉప్పొంగిన వాగు దాటలేక నిండు గర్భిణి పురిటి నొప్పులతో తల్లడిల్లింది. కుటుంబ సభ్యుల సాయంతో అతికష్టం మీద వాగు దాటి ఆస్పత్రికి చేరుకుంది. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని సులుగుపల్లిలోని బాపుగూడకు చెందిన సరిత గర్భిణి. ఆమెకు ఈ నెలాఖరుకు డెలివరీ డేట్ ఉంది. అయితే, ఆదివారం ఉన్నట్టుండి ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆశా వర్కర్‌కు సమాచారం అందించడంతో ఆమె అక్కడికి చేరుకుంది.
అందరూ కలిసి సరితను ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. గ్రామం సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో సరిత ఆ వాగును దాటలేకపోయింది. కుటుంబీకులు ఆమెను పట్టుకొని అతికష్టం మీద వాగును దాటించి వాహనంలో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బెజ్జూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డెలివరీ కాగా మగశిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో సోమవారం ఇంటికి పంపించారు.