నిజాయితీగా జాబ్ చేయలేకపోతున్నా.! లెటర్ రాసి పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

నిజాయితీగా జాబ్ చేయలేకపోతున్నా.! లెటర్ రాసి పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

తంగళ్ళపల్లి, వెలుగు: పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనంగా మారింది.  నిజాయితీగా డ్యూటీ చేయలేకపోతున్నానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ రాసిన లెటర్ చర్చనీయాంశ మైంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని వేములవాడ మండలం చింతలతాన ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన మంత్రి ప్రియాంక తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి. కాగా.. ఆమె తను బాధను వ్యక్తం చేస్తూ తండ్రికి లెటర్ రాసింది.  

అందులో “ నా జాబ్ కారణంగా మానసికంగా కుంగిపోతున్నా.. అధికార పార్టీ నేతలతో ఇబ్బందులు పడుతున్నా.. నిజాయితీగా ఉండాలనుకున్నా.. ఈ జాబ్ చేయలేకపోతున్నా.. నేను వెళ్లిపోతున్నా.. నా మీద ఎలాంటి అభండాలు వేయకండి” అంటూ అందులో పేర్కొంది.  అదే లెటర్ ను సోమవారం జిల్లా పంచాయతీ అధికారి, తంగళ్లపల్లి ఎంపీడీఓలకు వాట్సప్ ద్వారా పోస్ట్ చేసింది. 

అనంతరం ఆమె మిస్సింగ్ అయింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.  ఆమె ఏపీలోని తిరుపతిలో ఉన్నట్టుగా తెలిసింది.  పోలీసులు కూడా ధృవీకరించడంతో సెక్రటరీ కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్లారు. ఇక్కడికి తీసుకొచ్చాక పూర్తి వివరాలు తెలిసే చాన్స్ ఉంది. కాగా.. ప్రభుత్వ స్కీమ్ ల్లో అధికార పార్టీ నేతల ఇబ్బందుల కారణంగా కార్యదర్శి డ్యూటీ చేయలేని పరిస్థితి ఎదురైందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.