ఎత్తిపోయలేక గేట్లు ఎత్తేశారు .. నీళ్లు‌ నిల్వ చేయలేక గేట్లు తెరిచిన ఆఫీసర్లు

  • మేడిగడ్డ 12 గేట్లు ఓపెన్​.. 30 వేల క్యూసెక్కుల నీళ్లు వదిలేస్తున్రు
  • 17 బాహుబలి మోటర్లలో నడుస్తున్నవి ఏడే..  బ్యారేజీ కెపాసిటీ 16 టీఎంసీలే  

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు:   కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ ద్వారా ప్రాణహిత నీళ్లను పూర్తి స్థాయిలో లిఫ్టు చేయలేకపోయిన రాష్ట్ర సర్కారు మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఎత్తేసింది. వాటర్‌‌ లిఫ్టింగ్‌‌ ప్రారంభించిన 9 రోజులకే బ్యారేజీ‌ గేట్లను తెరిచి నీళ్లను కిందకు వదిలేసింది. కాళేశ్వరం ఆఫీసర్లు మేడిగడ్డ బ్యారేజీకి చెందిన 12 గేట్లను మంగళవారం ఓపెన్​చేసి, 36 వేల క్యూసెక్కుల వాటర్ ను దిగువకు రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజీ కెపాసిటీ 16 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13 టీఎంసీల వాటర్‌‌ నిల్వ ఉంది. ప్రాణహితలో ఇన్‌‌ఫ్లో పెరగడంతో బ్యారేజీ‌‌లో వాటర్‌‌ నిల్వ చేయలేక, పైకి ఎత్తిపోయలేక గేట్లు ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి కన్నెపల్లి దగ్గర17 బాహుబలి మోటార్లు నడిస్తే రోజుకు 36 వేల క్యూసెక్కుల వాటర్​ను ఎత్తిపోయవచ్చు. కానీ ప్రస్తుతం 7 మోటార్ల ద్వారా రోజుకు సగటున 0.7 టీఎంసీల చొప్పున గడిచిన తొమ్మిది రోజుల్లో కేవలం 6.5 టీఎంసీల నీళ్లను‌ మాత్రమే అన్నారం బ్యారేజీ‌‌కి లిఫ్ట్‌‌ చేశారు.  

పని చేస్తున్నవి 7 మోటార్లే 

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ఈ నెల 3న కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 4 మోటార్లను ఆన్ చేసి వాటర్ లిఫ్టింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత మోటార్ల సంఖ్యను ఆరు, ఏడుకు పెంచారు. మంగళవారం నాటికి గడిచిన తొమ్మిది రోజుల్లో కన్నెపల్లి నుంచి కేవలం 6.5 టీఎంసీల వాటర్ అన్నారం బ్యారేజీకి లిఫ్ట్ చేసినట్లు ఇంజినీర్లు చెప్తున్నారు. వాస్తవానికి మేడిగడ్డ బ్యారేజీ‌‌‌‌ నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున  ఏడాదిలో 225 టీఎంసీల నీటిని లిఫ్ట్‌‌‌‌ చేసి 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం వేల కోట్లు ఖర్చు చేసి కన్నెపల్లి(లక్ష్మి) పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌ దగ్గర 17 బాహుబలి మోటార్లను అమర్చారు. కానీ ఈ మోటార్లలో ప్రస్తుతం కొన్నే పని చేస్తున్నాయి. గతేడాది వరదలకు 6 మోటర్లు తుక్కుతుక్కు అయ్యాయి. మిగిలిన మోటర్లూ దెబ్బతిన్నాయి. అన్నింటినీ రిపేర్ చేసి అందుబాటులోకి తెచ్చామని సర్కారు ఇప్పటికే ప్రకటించింది. కానీ ప్రస్తుతం 7 పంపులు మాత్రమే పనిచేస్తున్నాయి.

అనుకున్న స్థాయిలో లిఫ్ట్​ చేయలే

బాహుబలి మోటార్లలో 7మాత్రమే పని చేస్తుం డటంతో ప్రాణహితలో వస్తున్న వరదను లిఫ్ట్‌‌‌‌ చేయడం ఇంజినీర్లకు సాధ్యపడట్లేదు. 7మోటార్లతో రోజుకు 0.6 నుంచి 0.7 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్‌‌‌‌ చేస్తున్నారు. ఈ నెల 3న సోమవారం కన్నెపల్లి దగ్గర మోటార్లు స్టార్ట్‌‌‌‌ చేసిన సమయంలో మేడిగడ్డ బ్యారేజీ‌‌‌‌లో కేవలం 5 టీఎంసీల వాటర్‌‌‌‌ మాత్రమే ఉంది. కానీ గడిచిన 9 రోజుల్లో ఇది13 టీఎంసీలకు చేరింది. ఏడు మోటర్లే నడవడంతో అనుకున్న స్థాయిలో వాటర్‌‌‌‌ లిఫ్ట్‌‌‌‌ చేయలేకపోయారు. ఫలితంగా బ్యారేజీ‌‌‌‌లో నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. దీంతో గేట్లు ఖుల్లాగా తెరవాల్సిన పరిస్థితి దాపురించింది. మంగళవారం 39 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో ఉండగా ఆఫీసర్లు 12 గేట్లు తెరిచి 36 వేల క్యుసెక్కుల వాటర్‌‌‌‌ ను దిగువకు విడుదల చేస్తున్నారు.   

నాలుగేండ్లుగా.. ఎత్తుడు, వదులుడే.. 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ పనితీరుపై మొదటి నుంచీ విమర్శలు వస్తున్నాయి. వానాకాలంలో వరదను ఆపలేక గేట్లు ఖుల్లాగా తెరిచి నీళ్లను వదిలేస్తున్నరు. ఎండాకాలంలో ప్రాణహితలో వాటర్‌‌‌‌ ఉండక మోటార్లను ఆన్‌‌‌‌ చేయట్లేదు. 2019 జులై నెలలో ఈ ప్రాజెక్ట్‌‌‌‌ ను ప్రారంభించారు. గడిచిన నాలుగేళ్ల రికార్డులను పరిశీలిస్తే వర్షాకాలంలో నీటిని ఎగువకు పంపింగ్‌‌‌‌ చేసే అవకాశం ఉండట్లేదు. ఎందుకంటే ఆ సమయంలో ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి మొదలుకొని ఎగువన రిజర్వాయర్లన్నీ ఫుల్ గా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో మోటార్లను స్టార్ట్‌‌‌‌ చేసి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలకు వాటర్ లిఫ్ట్‌‌‌‌ చేసినా ఆ తర్వాత కురిసే వానలతో తిరిగి గేట్లను తెరిచి కిందికి వృథాగా వదిలిపెట్టాల్సి వస్తోంది. 2019, 2020, 2021 సీజన్‌‌‌‌లలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 60 టీఎంసీల నీళ్లను ఇలాగే వృథాగా వదిలేసింది. దీంతో కరెంట్‌‌‌‌ ఖర్చుల రూపంలో రూ. వేల కోట్ల నష్టం వచ్చింది. 

కొత్త ఆయకట్టుకు నీళ్లు వట్టి ముచ్చట్నే 

ఏటా జూన్‌‌‌‌ నుంచి డిసెంబర్‌‌‌‌ వరకు వానాకాలంలో నీళ్లను లిఫ్ట్ చేయడం, వరదలొస్తే వదిలేయడం.. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మళ్లీ ఎండాకాలంలో మార్చి నుంచి మేడిగడ్డ బ్యారేజీ వద్ద వాటర్‌‌‌‌ లెవల్స్‌‌‌‌ పూర్తిగా పడిపోతున్నాయి. రోజుకు 2 వేల నుంచి 500 క్యూసెక్కుల వరద మాత్రమే ఉంటుంది.  వాటర్‌‌‌‌ లెవల్స్‌‌‌‌ లేకపోవడంతో కన్నెపల్లి దగ్గర మోటార్లు బంద్‌‌‌‌ చేయాల్సిన పరిస్థితి ఉంటోంది. యాసంగి సీజన్‌‌‌‌లో 3 నెలలు మాత్రమే వాటర్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌ సాధ్యం అవుతోంది. ఈ లెక్కన ఏడాదిలో మేడిగడ్డ బ్యారేజీ‌‌‌‌ నుంచి 60 టీఎంసీలకు మించి వాటర్‌‌‌‌ లిఫ్ట్‌‌‌‌ చేసే పరిస్థితి లేదని ఇంజినీర్లు చెప్తున్నారు. ఈ నీళ్లతో పాత ఆయకట్టు స్థిరీకరణ తప్ప సర్కారు చెప్పినట్లు కొత్తగా 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అనేది వట్టి ముచ్చట్నే అని స్పష్టం చేస్తున్నారు.