లాక్ డౌన్ లో ఆగమైనమంటున్న ఆటోడ్రైవర్లు
ప్రస్తుతం మెట్రోతో సగం గిరాకీ తగ్గిందని ఆవేదన
ఆటోస్టాండ్లు ఏర్పాటు చేసి భరోసా కల్పించాలె
ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్
‘‘ఇల్లు గడవాలంటే నడవడం తప్ప మాకు దిక్కు లేదు. లాక్ డౌన్ లో మస్తు ఇబ్బందులు పడ్డం. లాక్ డౌన్ తర్వాత కొన్ని రోజులకే మెట్రో ట్రైన్స్ స్టార్ట్ కావడంతో ఆటోలు ఎక్కే ప్యాసింజర్లు సగానికి తగ్గిన్రు. గ్రేటర్ లో సరైన ఆటో స్టాండ్లు లేకపోవడంతో రోడ్డు పక్కన జరసేపు బండి ఆపితే ట్రాఫిక్ చలాన్లు పడుతున్నయ్. యూనియన్లు ఉన్నా పనిచేయవు. మమ్మల్ని పట్టించుకునేటోళ్లు లేరు’’ పదేళ్లుగా ఆటో నడుపుతున్న షేక్ పేటలోని ఓయూ కాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఆవేదన.
హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ లో 2 లక్షలు ఆటోలున్నాయి. ఉబెర్, ఓలా,ర్యాపిడో లాంటి ప్రైవేటు కంపెనీల ట్రాన్స్ పోర్ట్ కారణంగా రెండు మూడేండ్లుగా సిటిజన్లు ఆటోలు ఎక్కేందుకు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపడం లేదు. ఇక కరోనా ఎఫెక్ట్, లాక్ డౌన్ రూల్స్ తో ఆటోలు నడవక వారు ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్ డౌన్ తో తమ బతుకులు ఆగమైనయని ఆటోవాలాలు అంటున్నారు. దాదాపు 7 నెలల నుంచి కిస్తీలు కట్టుకునేందుకు నానా అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మెట్రో రన్ అవుతుండటంతో గిరాకీ తగ్గిందంటున్నారు. ఇంటి కిరాయి కట్టలేకపోతున్నామని..నెలవారీ సరుకులకు సరిపడా ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిటీలో ఎక్కడా సరిగ్గా ఆటోస్టాండ్లు, యూనియన్లు లేవని.. వాటిని ఏర్పాటుచేస్తే తమకు కొంత భరోసాగా ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల ఆటో యూనియన్లు ఉన్నా అవి కలిసికట్టుగా పనిచేస్తలేవంటున్నారు. శానిటైజర్ వాడుతున్నా.. డిస్ ఇన్ ఫెక్టివ్ స్ర్పే చేస్తున్నా కరోనాకు భయపడి ప్యాసింజర్లు రావడం లేదని.. ఒకప్పుడు రోజుకి రూ.వెయ్యి గిరాకీ ఉంటే ప్రస్తుతం రూ.200, రూ.300 రావడం కూడా వస్తలేవంటున్నారు.
సగం పైసలు చలాన్లకే..
ఓ వైపు గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మరోవైపు ప్యాసింజర్ల కోసం జరసేపు రోడ్డు పక్కన ఆటో ఆపినా ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు కొట్టి చలాన్లు వేస్తున్నారని డ్రైవర్లు చెప్తున్నారు. రోజు సంపాదనలో సగం డబ్బులు చలాన్లు కట్టేందుకే పోతున్నాయని వారు బాధను వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ లో ఎక్కువగా ఆటోస్టాండ్లు లేకపోవడం వల్లే రోడ్లపక్కన ఆపి ప్యాసింజర్ల కోసం వెయిట్ చేయాల్సి వస్తోందంటున్నారు. లాక్ డౌన్ ముందు ఆటోలో నలుగురిని తీసుకెళ్లేవాళ్లమని ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ఇద్దరిని మాత్రమే తీసుకెళ్తున్నామని దీనివల్ల పెట్రోల్ డబ్బులు కూడా రావడం లేదంటున్నారు.
‘ ఇల్లు గడవాలంటే ఆటో నడపడం తప్ప మాకు మరో దిక్కులేదు. లాక్ డౌన్ లో మస్తు ఇబ్బందులు పడ్డం. లాక్ డౌన్ తర్వాత కొన్నిరోజులకే మెట్రో ట్రైన్స్ స్టార్ట్ కావడంతో ఆటోలు ఎక్కే ప్యాసింజర్లు సగానికి తగ్గిన్రు. గ్రేటర్ లో సరైన ఆటోస్టాండ్లు లేకపోవడం తో రోడ్డు పక్కన జరసేపు బండి ఆపితే ట్రాఫిక్ చలాన్లు పడుతున్నయ్. యూనియన్లు ఉన్నా పనిచేయవు. మమ్మల్ని పట్టించుకునేటోళ్లు లేరు’ ఇది గత పదేళ్లుగా ఆటో నడుపుతున్న షేక్ పేటలోని ఓయూ కాలనీకి చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆవేదన.
సాయం చెయ్యాలె
గతంలో ఓ కంపెనీలో జాబ్ చేసేటోణ్ని. ఏడాది క్రితం జాబ్ పోయిందని ఆటో నడపడం మొదలుపెట్టా. లాక్ డౌన్ లో ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో కొంచెం రేట్లు పెంచినం. దీంతో ఆటో ఎక్కేటోళ్లు తగ్గిన్రు. ప్యాసింజర్లు రోడ్లమీదనే ఆగుతరు. వాళ్లకోసం పోతే ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీస్తున్నరు. ఆటో స్టాండ్ ఉంటే మాకు సేఫ్ ఉంటది. మేం అక్కడ ఆటో ఆపుకుంటం. స్కూల్స్, కాలేజ్ లు లేకపోవడంతో రెగ్యులర్ గా ఆటోలు ఎక్కి వచ్చే స్టూడెంట్స్ లేక ఆదాయం తగ్గింది. మాకు కారోబార్ నడిచేలా సాయం చేస్తే బాగుంటుంది. – చిన్నా, ఆటోడ్రైవర్, బోరబండ.
మస్తు ఇబ్బంది పడ్డం
నేను ఫైనాన్స్ లో ఆటో తీసుకుని రెండేళ్లుగా నడుపుతున్నా. ఒకప్పుడు రోజుకి రూ.వెయ్యికి పైగా సంపాదన ఉండేది. ఇప్పుడు రూ.100, 200 లు మాత్రమే వస్తున్నయ్. ఇంటికెళ్లేసరికి వంద రూపాయలు మిగుల్తున్నయ్. సరుకులు తెచ్చుకునేందుకు పైసలు సరిపోతలేవు. గత నెల ఇంటి కిరాయి కూడా కట్టలే. మళ్లీ ఒకటో తారీఖు వచ్చింది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలె.– సుధాకర్, ఆటోడ్రైవర్, జూబ్లీహిల్స్.