- విద్యార్థుల బడి కష్టాలకు చెక్ పెట్టి బిల్డింగ్ నిర్మాణం
- గ్రామస్తులతో కలిసి ప్రారంభించిన భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాచలం, వెలుగు : ఆదివాసీ విద్యార్థుల బడి బాధలు చూడలేక కొత్త బిల్డింగ్ నిర్మించి ఇచ్చి చర్ల పోలీసులు గ్రామస్తులతో శభాష్ అనిపించుకున్నారు. ఛత్తీస్గఢ్సరిహద్దులోని భద్రాద్రి జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన చర్ల మండలం బూరుగుపాడులో పూరిపాకలో నిర్వహించే బడి శిథిలమైంది. అక్కడ చదువుకునే ఆదివాసీ పిల్లలు కష్టాలను చూసిన చర్ల పోలీసులు నూతనంగా బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టారు.
చర్ల సీఐ రాజు వర్మ ఆధ్వర్యంలో రూ. 2.50 లక్షల సొంత ఖర్చులతో బడిని నిర్మించగా.. సోమవారం ఎస్పీ రోహిత్‌రాజ్ ప్రారంభించారు. కొత్త పాఠశాల భవన ప్రారంభోత్సవానికి వచ్చిన పోలీసులకు ఆదివాసీలు తమ సంప్రదాయం ప్రకారం ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపారు.
బడిని ప్రారంభించిన అనంతరం స్కూలు పిల్లలకు ఎస్పీ బుక్స్, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. మంచిగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. చదువుతోనే +భవిష్యత్‌ను చక్కదిద్దుకోవాలని పేర్కొన్నారు. పోలీసులు చేసిన సాయానికి ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ సాయి మనోహర్, ఎస్ బీ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, సీఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ బాలకృష్ణ, సిబ్బంది ఉన్నారు.