
- కోళ్ల రైతులకు దక్కని గిట్టుబాటు ధర
- కిలో కోడి మీద దాదాపు రూ.30 నష్టం
- ట్రేడర్లకు మాత్రం లాభాలు
వరంగల్, శాయంపేట, వెలుగు: ఉమ్మడి జిల్లాలో పౌల్ట్రీ రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. కిలో కోడిని పెంచడానికి రైతు సుమారు రూ.100 ఖర్చు చేస్తుంటే ట్రేడర్స్ మాత్రం రూ.70 చొప్పున కట్టిస్తూ నష్టాల ఊబిలోకి నెడుతున్నారు. కోళ్లను తక్కువ రేటుకు కొని, వినియోగదారుడికి మాత్రం పాత రేటుకే అమ్ముతున్నారు. బ్లాక్ మార్కెట్ కు పాల్పడుతూ.. ట్రేడర్స్ రూ.వేలు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో చికెన్ రేటు తగ్గినా, రైతులకు మాత్రం నష్టాలు తప్పడం లేదు.
30 నష్టం..
ఒక్కో కోడి పిల్లను రైతు రూ.32 చొప్పున కొనుగోలు చేస్తున్నాడు. పిల్ల నుంచి 2 కిలోల కోడి వరకు ఎదడగానికి 45 రోజుల దాణా ఖర్చు రూ.157, లేబర్ మెయింటెనెన్స్ కోసం మరో రూ.10. మొత్తంగా కోడికి రూ.199 నుంచి రూ.200 ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన కిలో కోడికి రైతు రూ.100 ఖర్చు అవుతోంది. కాగా, దేశవ్యాప్తంగా వీహెచ్ఎల్ (వెన్కాబ్) అనే సంస్థ ఏ రోజుకారోజు కోడి, చికెన్ ధర నిర్ణయిస్తుంది. కిలో కోడిని ట్రేడర్స్ రైతు నుంచి ఏ ధరకు కొనుగోలు చేయాలి. చికెన్ సెంటర్లో ఏ ధరకు విక్రయించాలనేది పేపర్ ప్రకటన ఇస్తుంది. దీని ఆధారంగా ట్రేడర్స్ రైతుల నుంచి కోళ్లను సేకరించి షాపు నిర్వాహకులకు చేరవేయడం ద్వారా జనాలకు చికెన్ అందుబాటులోకి తెస్తారు. ఈ క్రమంలో జనవరి 15 వరకు పేపర్ ధర ప్రకారం కిలో కోడి రూ.117 ఉండగా.. ఇప్పుడది రూ.84 కు పడిపోయింది. రైతు తాను పెట్టిన పెట్టుబడి రావట్లేదని కన్నీరు పెడుతుంటే.. కార్పొరేట్ చికెన్ సెంటర్లతో చేతులు కలిపిన ట్రేడర్స్ వెన్కాబ్ ఇచ్చే పేపర్ ధర కంటే మరో రూ.10 నుంచి రూ.20 తక్కువ ఇస్తేనే కొనుగోలు చేస్తామని.. లేదంటే ఇంటిగ్రేషన్ పేరుతో పౌల్ట్రీలు నడుపుతున్న కార్పొరేట్ కంపెనీల వద్ద కొంటామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కోడి వయసు 45 రోజులు దాటితే దాణా రూపంలో మరింత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో రైతులు ట్రేడర్లు అడిగిన కిలో కోడి ధర రూ.70 చొప్పున అమ్ముకోవాల్సి వస్తోంది. మొత్తంగా కిలో కోడికి రైతులు రూ.30 చొప్పున రివర్సులో నష్టపోతున్నారు. కార్పొరేట్ కంపెనీలు రైతులను కోళ్ల వ్యాపారాలకు దూరం చేయాలని చూస్తున్నాయి. భవిష్యత్తులో తాము ఇచ్చిందే చికెన్.. పెట్టిందే ధర అన్నట్లు కుట్రలు చేస్తున్నాయి.
దళారి లాభం.. రూ.45
ఫౌల్ట్రీ వ్యాపారాన్ని నమ్ముకున్న రైతులు, చికెన్ రూపంలో దానిని తీసుకుంటున్న జనాలు ధర రూపంలో నష్టపోతుండగా.. దళారులుగా ఉండే ట్రేడర్స్ అక్రమంగా దోచుకుంటున్నారు. ప్రస్తుతం కిలో కోడిని రైతు వద్ద రూ.70 చొప్పున కొంటున్న ట్రేడర్ దానిని చికెన్ సెంటర్లకు రూ.115కి విక్రయిస్తున్నాడు. చికెన్ సెంటర్ నిర్వాహకులు ఈ ధరను మరింత పెంచి జనాలకు అమ్ముతున్నారు. ఈ లెక్కన 45 రోజుల పాటు కోడిని పెంచిన రైతు రూ.30 నష్టపోతుంటే.. మధ్యవర్తిగా ఉండే ట్రేడర్ మాత్రం కిలో కోడిపై రూ.45 అక్రమంగా సంపాదిస్తున్నాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అప్పులపాలైతున్నారు.
2 నెలల్లో.. రూ.3 లక్షల నష్టం
15 ఏండ్లుగా కోళ్ల ఫారం నడిపిస్తున్నా. షెడ్ 16 వేల కెపాసిటీ ఉంది. ఇంటిగ్రేషన్ పేరుతో కార్పొరేట్ కంపెనీలు గ్రామాల్లో సొంత ఫారాలు నడుపుతూ రైతులను ఆగం చేస్తున్నాయి. పేపర్లో వచ్చే ధరల కంటే తక్కువ ధర చెల్లిస్తున్నాయి. బరువు పెరిగిన కోళ్లను ఎలాగూ దగ్గర ఉంచుకోలేమని తెలిసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వారం కింద మా ఫారం నుంచి 8000 కోళ్లు అమ్మగా.. పెట్టిన ఖర్చు కంటే రూ.3 లక్షల నష్టం వచ్చింది.
- బానోతు అనిల్(శాయంపేట, హనుమకొండ)
కోళ్ల ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలే
కార్పొరేట్ సంస్థలు కోడి ధరను నిర్ణయించడం ద్వారా ఈ రంగంలో ఏండ్ల తరబడిగా ఉన్న రైతులు నష్టాలతో అప్పులపాలవుతున్నాం. ధర వారే నిర్ణయించి.. ఇంటిగ్రేషన్ ఫారాల పేరుతో వారే ఫౌల్ట్రీలు నడుపుతున్నారు. మళ్లీ వారు చెప్పిన ధర కంటే మరో కిలోపై రూ.10 నుంచి రూ.20 తక్కువ ధరకు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మొత్తంగా ఒక్కో కోడిపై పెట్టిన ఖర్చు కంటే రూ.60 నష్టపోతున్నాం. ప్రభుత్వం దళారులను నియంత్రించకుంటే రైతులకు ఇక ఆత్మహత్యలే శరణ్యం.
- మోతుకురి ప్రభాకర్, (నేరెడుపల్లి)