- ఆగిన యునాని దిగుమతులు.. రేట్లు డబుల్
- ఆఫ్ఘనిస్తాన్లోని ఘటనలతో సిటీలోని స్టోర్లపై ఎఫెక్ట్
- పాత స్టాక్‌పై పెరిగిన ధరలు
- హోల్ సేల్, రిటైల్ వ్యాపారులపై పడిన భారం
- మాల్ కొనలేక.. స్టాక్ లేక ఖాళీగా ఉన్నామంటున్నస్టోర్ల నిర్వాహకులు
హైదరాబాద్, వెలుగు: ఆఫ్ఘనిస్తాన్లోని పరిణామాల కారణంగా సిటీలోని యునాని మెడిసిన్ స్టోర్లపై తీవ్ర ఎఫెక్ట్‌పడింది. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మన దేశం దిగుమతి చేసుకునే యునాని మెడిసిన్సరఫరా నిలిచిపోయింది. దీంతో ఢిల్లీలోని మెయిన్ డీలర్లు రేట్లు పెంచడంతో సిటీలోని డీలర్లు కూడా పాత స్టాక్ పై రెండు, మూడింతలు రేట్లు పెంచేశారు. ఇది హోల్ సేల్, రిటైల్ వ్యాపారులకు భారంగా మారింది. ప్రస్తుతం సిటీలోని యునాని మెడిసిన్ స్టోర్లు చాలా వరకు స్టాక్ లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. డీలర్ల వద్ద కొనాలంటే ధరలకు భయపడి తీసుకోవడం లేదని రిటైల్ వ్యాపారులు చెప్తున్నారు. మరికొంత కాలం పరిస్థితులు ఇలాగే కొనసాగితే బిజినెస్ చేయడం కూడా కష్టమని వారు పేర్కొంటున్నారు.
దిగుమతుల ఆగిపోగా..
ఆప్ఘనిస్తాన్ నుంచి యునానీ మెడిసన్ ను ముంబై, ఢిల్లీలోని డీలర్లు దిగుమతి చేసుకుంటారు. అకర్కార, ప్యూర్ జాఫ్రాన్, ప్యూర్ హనీ, క్యూస్ట్ ఉల్ హిండ్, గార్లిక్, ఉనాబ్ బేర్, ములేటి, వాల్ నట్, ఆప్రికాట్, పైన్ నట్, మునఖా వంటి యునాని మెడిసిన్ దిగుమతి చేసుకుంటారు. వారి నుంచి సిటీలోని బేగంబజార్ కి చెందిన డీలర్లు కొనుగోలు చేస్తుంటారు. ఆ తర్వాత రిటైల్, హోల్‌సేల్ ఫార్మసిస్ట్ లకు అమ్ముతారు. ప్రస్తుతం ఆప్ఘన్ లోని పరిణామాల కారణంగా యునాని ప్రొడక్ట్స్ సరఫరా ఆగిపోయింది. దీంతో ఢిల్లీలోని డీలర్లు రేట్లు పెంచేశారు. కొద్ది రోజుల క్రితం వరకు కిలో ఖుబాని ( ఆప్రికాట్ ) రూ.160 ఉండేది. ఇప్పుడది300 పైనే ధర ఉంది. మునఖా కిలో ధర రూ. 350 ఉంటే, ప్రస్తుతం రూ. 500 పైనే డీలర్లు అమ్ముతున్నారు. దీంతో మెడిసిన్ కొనడం యునాని ఫార్మసీ స్టోర్ ల నిర్వాహకులకు భారంగా మారింది. మరోవైపు సిటీలోని డీలర్లు పాత స్టాక్ పై ధరలు రెండింతలు చేసి అమ్ముతున్నారు. రేట్లు పెంచడంతో స్టోర్ల నిర్వాహకులు స్టాక్ ఉండకపోతుండగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మాల్ ఇయ్యాలంటే..
టోలిచౌకి, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, చార్మినార్, నాంపల్లి, బేగం బజార్ తదితర ఏరియాల్లో యునాని మెడిసిన్ స్టోర్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. వీటి నిర్వాహకులు బేగంబజార్ లోని డీలర్ల నుంచి మాల్ కొనుగోలు చేస్తుంటారు. అఫ్ఘనిస్తాన్‌లోని సంఘటన కారణంగా రెట్టింపు ధరలు పెంచడంతో కొనలేకపోతున్నామని స్టోర్ల వ్యాపారులు అంటున్నారు. గతంలో లక్ష రూపాయలు కూడా క్రెడిట్ మీద డీలర్లు ఇచ్చే వాళ్లని, ప్రస్తుతం డబ్బు ఇచ్చి సరుకు తీసుకెళ్లమంటున్నారని చెప్తున్నారు. ఎక్కువ ధరకి మాల్ కొనలేకపోతున్నామని, స్టాక్ లేక షాపులన్నీ ఖాళీగా ఉన్నాయంటున్నారు.
స్టాక్ లేక ఖాళీగా ఉంటున్నం
యునాని మెడిసిన్స్, హెర్బల్స్ వ్యాపారం 28 ఏళ్లుగా చేస్తున్నం. సిటీలో రెండు బ్రాంచ్ లు ఉన్నాయి. ఆప్ఘన్ లోని పరిణామాలతో యునాని మెడిసిన్‌పై ఎఫెక్ట్ పడింది. డీలర్లు రేట్లు పెంచేశారు. డబుల్ రేట్లకు అమ్ముతుండగా కొనలేకపోతున్నాం. స్టాక్ అయిపోవడంతో షాపు ఖాళీగా ఉంది.
- మహ్మద్ నిహార్ అహ్మద్ , హకీమ్ ఎంఏ- వహబ్- దవాసజ్ స్టోర్, టోలిచౌకి